Andhra Pradesh: హోంగార్డు నియామకాల స్కాంలో వెలుగులోకి సంచలన విషయాలు.. ఏడుగురు అరెస్ట్..

|

Dec 14, 2022 | 8:29 AM

చిత్తూరు జిల్లాలో నకిలీ హోంగార్డుల నియామకం స్కాంలో దర్యాప్తు కొనసాగుతోంది. అనంతపురం డిఐజి రవి ప్రకాష్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి విచారణ చేస్తున్నారు.

Andhra Pradesh: హోంగార్డు నియామకాల స్కాంలో వెలుగులోకి సంచలన విషయాలు.. ఏడుగురు అరెస్ట్..
Home Guard
Follow us on

చిత్తూరు జిల్లాలో నకిలీ హోంగార్డుల నియామకం స్కాంలో దర్యాప్తు కొనసాగుతోంది. అనంతపురం డిఐజి రవి ప్రకాష్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలు ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో నిఘా, పర్యవేక్షణ లోపం ఉన్నట్టు చెబుతున్నారు విచారణాధికారులు. 2020 జనవరి 24న చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నకిలీ హోంగార్డుల వ్యవహారంపై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ప్రధాన ముద్దాయిలుగా ఉన్న మణికంఠ యువరాజులను అప్పుడే అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అప్పుటి రాష్ట్ర హోంగార్డ్స్ కమాండెంట్ గా ఉన్న రామ్మోహన్ రావు చిత్తూరుకు వచ్చి దర్యాప్తు నిర్వహించారు. 676 మంది మాత్రమే నిబంధనల ప్రకారం రిక్రూట్ అయినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించిన నివేదికను జిల్లా యంత్రాంగానికి అందించారు. కానీ హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్ రావు నివేదికపై సరైన చర్యలు తీసుకోలేదు.

తాజాగా, జిల్లాల పునర్విభజనలో మరోసారి హోంగార్డుల స్కాం బయటకు వచ్చింది. దీంతో అనంతపురం డిఐజి రవి ప్రకాష్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని అరెస్టు చేశారు. ముఖ్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేసే హోంగార్డు రైటర్ మణికంఠ, హోంగార్డు ఇన్చార్జి కానిస్టేబుల్ జయకుమార్, హోమ్ గార్డ్ క్లర్క్ కిరణ్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు హోంగార్డులను కూడా రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 90 మంది నకిలీ హోంగార్డులను తొలగిస్తూ డిఐజి రవి ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. 2014 నుంచి 2019 వరకు నకిలీ జీవోలు సృష్టించి హోంగార్డులకు పోస్టింగులు ఇచ్చారు. ఈ నకిలీ హోంగార్డులు జిల్లాలోని 9 ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. ఆర్టీసీ, అగ్నిమాపక శాఖ, కాణిపాకం దేవస్థానం, ఆర్పిఎఫ్, టీటీడీ, రవాణా శాఖ, జైళ్ల శాఖ, SPDPS లో ఈ నకిలీ హోంగార్డులు ఉద్యోగాలు చేస్తున్నట్టు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పది ఏళ్లుగా ఈ నకిలీల వ్యవహారం కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి ఎనిమిది లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్టు దర్యాప్తులో వెల్లడయింది. ఇంత పెద్ద స్కాం లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా లేదా? అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..