కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న చర్చి.. స్లాబ్ కింద నలిగి ఒకరు దుర్మరణం!
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మంది కృష్ణాపురంలో నిర్మాణంలో ఉన్న చర్చి భవనం స్లాబ్ వేస్తుండగా కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ఒక కార్మికుడు దుర్మరణం పాలవగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలు, భద్రతా ప్రమాణాలపై విచారణ జరుగుతోంది.

చిత్తూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గుడిపాల మండలం మంది కృష్ణాపురంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చర్చి భవనంపై కాంక్రీట్ స్లాబ్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలిపోయిన కాంక్రీట్ స్లాబ్ శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టారు.
తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో నిర్మాణ ప్రాంతంలో మరికొందరు కార్మికులు ఉన్నారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.. శిథిలాలను తొలగించే పనులను ముమ్మరం చేశారు.
స్లాబ్ కూలిపోవడానికి అసలు కారణం ఏమిటి? నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించారా? ప్రమాద సమయంలో భద్రతా చర్యలు తీసుకున్నారా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సహాయక చర్యలు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
