Chiranjeevi : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా అన్నయ్య.. ఇక తమ్ముడికి భుజం కాసినట్లేనా..?
అనుకున్నదే జరిగింది. చిరంజీవి.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆయన జనసేనకు దగ్గరవుతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.

ఏఐసిసి క్రియాశీలక సభ్యుడిగా ఐడి కార్డ్ అందుకున్న మెగాస్టార్ ఈరోజు అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న మెగాస్టార్ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి తాను దూరంగా ఉంటున్నట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం శంషాబాద్ పరిసరాల్లో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో జనసేనకు మద్దతు ఇస్తానేమో అని ఆయన అన్నారు. పవన్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని పేర్కొన్నాడు. తాను ప్రజంట్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే పవన్‌కు మంచిదేమో అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ అధ్యక్ష ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 19న ఫలితాలు
అయితే, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు జరిగిన పోలింగ్.. తెలుగురాష్ట్రాల్లో గందరగోళం మధ్య ముగిసింది. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి డెలిగేట్స్ అంతా.. కర్నూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు కళా వెంకట్రావ్ భవనంలో ఓటు వేశారు. ఏపీలో మొత్తంగా 350 మందికి గాను 310 మంది ఓటు వేశారు. తెలంగాణలో 241కి గాను 226 మంది ఓటు వేశారు. శశిథరూర్, మల్లిఖార్జున కర్గేల్లో.. కాంగ్రెస్ పగ్గాలు ఎవరు చేపడతారనేది ఈ నెల 19న తేలిపోనుంది.
ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి… గాంధీభవన్ సాక్షిగా రచ్చరచ్చ జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే సభ్యులకు… ఏఐసీసీ ప్రత్యేకంగా ఇష్యూ చేసిన కార్డుల్లో గందరగోళమే దీనికి కారణమైంది. కార్డులు ఉన్నా… లిస్టులో పేరు లేదంటూ.. కొందరు నేతల్ని ఓటింగ్ అనుమతించకపోవడం దుమారం రేపింది. ఈ లిస్టులో సీనియర్ నేతలు సూచించినవారి పేర్లు ఉండటంతో.. వివాదం పెద్దదైంది. పార్టీ ఎన్నికల ఆర్గనైజింగ్ విభాగం వివరణ ఇవ్వాలంటూ… అనుచరులతో కలిసి గాంధీ భవన్ మెట్లమీదే నిరసనకు దిగారు పొన్నాల, దామోదర రాజనరసింహ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంలో నేతల తీరు.. ఎవరి వెర్షన్ వారిదే అన్నట్టుగా ఉంది. అసలు ఓటరు లిస్టులో గందరగోళానికి కారణం ఎవరు? దీని వెనక ఎవరున్నారు? కావాలనే ఇదంతా చేస్తున్నారా? ఈ అంశంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్.. కాకరేపుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తన దగ్గర ఉందంటున్న పొన్నాల … దాన్ని ధృవీకరించుకుని బయటపెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే, AICC ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఓటర్ లిస్ట్‌కు, పీసీసీకి సంబంధం లేదన్న రేవంత్.. అధిష్టానమిచ్చిన లిస్ట్ ప్రకారమే ఓటింగ్ జరిగిందన్నారు. తాను కూడా అందరు డెలిగేట్స్‌లాగే ఓటేశాననీ… ఈ ఇష్యూలో తాను ఇన్వాల్వ్ కాలేదనీ చెప్పారు రేవంత్. ఎవరికైనా అపోహలు ఉంటే ఏఐసీసీకి ఫిర్యాదు చేయొచ్చన్నారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం
