ఎంఎస్ఎంఈల విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాటికి చేయేూత కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. కంపెనీలు, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఆలస్యం ఉండకూడదని చెప్పారు. వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటికి క్లియరెన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టు పనులు నవంబరు నుంచి, భావనపాడు పోర్టు పనులను డిసెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రానికి మంజూరైన బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణ ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు. బల్క్ డ్రగ్‌పార్కులో కంపెనీలు పెట్టేందుకు ఫార్మా కంపెనీల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.
ఎస్‌ఐపీబీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి. సంస్థలకు చేయూత ఇవ్వాలి. ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సీఎస్, సీఎంవో అధికారుల పర్యవేక్షణ ఉండాలి. డిసెంబరు నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లను ఫైబర్‌తో అనుసంధానం చేసి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలి. డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ లైబ్రరీలు వస్తే తమ సొంత గ్రామాల నుంచే మెరుగైన ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు ప్రారంభించడమే కాకుండా, వాటిని నిలబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వాలి. అవి నిలదొక్కుకునేలా వాటికి నిరంతరం చేయూతనివ్వాలి.
– వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెఫ్ట్‌ను బలోపేతం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ అవుతుందని, చాలామందికి ఆదర్శనీయంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. ప్రతి జిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎస్‌ఎంఈలను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. వీటి వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, తద్వారా నిరుద్యోగం తగ్గుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
రామాయపట్నం పోర్టులో మార్చి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అయితే.. 2023 డిసెంబరు నాటికి పనులు పూర్తయ్యేలా ప్రయత్నించాలని సీఎం జగన్ సూచించారు. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..