కాపులకు రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ్టి నుంచి నిరవధిక దీక్షకు సిద్ధమైన మాజీ ఎంపీ, కాపుసేన అధ్యక్షుడు హరిరామ జోగయ్యను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో హైటెన్షన్ వాతావరణ ఏర్పడింది. దీక్ష భగ్నం చేసేందుకు నిన్న సాయంత్రం ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అప్పటికే సిద్ధం చేసిన అంబులెన్స్‌లో హరిరామ జోగయ్యను ఏలూరు హాస్పిటల్‌కు తరలించారు. జోగయ్య ఇంటికి వంద మీటర్ల దూరం వరకు పోలీసులు మీడియాను అనుమతించలేదు. రాత్రి పెద్ద ఎత్తున పోలీసులు హరిరామ జోగయ్య ఇంటి దగ్గర మోహరించిన క్రమంలో ఈ నిమిషం నుంచి దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
నిన్న ఉదయం ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన హరిరామజోగయ్య ఇవాళ్టి నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై స్పందన లేదన్న ఆయన కాపు రిజర్వేషన్ల సాధన కోసం చావడానికైనా సిద్ధమంటూ ప్రకటించారు. నరసాపురం గాంధీ బొమ్మల సెంటర్‌లో అనుమతి ఇవ్వకపోతే ఇంటి ఆవరణలోనే దీక్ష చేపడతానన్నారు. భగ్నం చేస్తే ఆసుపత్రిలోనైనా దీక్ష కొనసాగిస్తా అంటూ ప్రకటించారు.
ఈ క్రమంలో దీక్షకు సిద్ధమైన హరిరామ జోగయ్యను హాస్పిటల్‌కు తరలించారు. ఆయన వైద్య సేవలు పొందేందుకు నిరాకరించారు. అయితే ఆయన దీక్ష చేస్తారా? వైద్యులు భగ్నం చేస్తారా? అన్నది ఆసక్తి నెలకొంది.
కాపులకు గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని హరి రామజోగయ్య కోరుతున్నారు. అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా బలహీనులైనవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..