Andhra: పేద్ద పండుగే.. ఇకపై మధ్యాహ్న భోజనంలో ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యాహ్న భోజన పధకంలో కీలక మార్పులు చేసింది కూటమి సర్కార్. పైలెట్ ప్రాజెక్టు కింద మొదట 'ఎగ్ ఫ్రైడ్ రైస్'ను ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.!

పిల్లలకు బలమంతమైన శరీరాన్ని, బుద్ధిమంతమైన మనసును అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో కొత్త పరిణామాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రుచికరమైన, ఇంకా ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం అందించేందుకు మెనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై వారంలో రెండు రోజులు మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలకు అవసరమైన ప్రోటీన్, మినరల్స్ పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా కూరగాయలు, పప్పులలో మునగ పొడి వాడకం ద్వారా రోగనిరోధక శక్తి పెరగాలని భావిస్తున్నారు.
బాలామృతం..
ఇంతటితో ఆగకుండా బాలామృతంలోనూ సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న బాలామృతంలో చక్కెరను తగ్గించి పెసరపప్పు, గోధుమపిండి, వేయించిన వేరుశనగ పొడి, శనగపొడి వంటి పోషక పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ మార్పులు తొలుత విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్లలోని కొన్ని అంగన్వాడీల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుని మరిన్ని మెరుగులు దిద్దారు. కొంతమంది చక్కెర లేకపోవడం వల్ల రుచి తక్కువగా ఉందని చెబితే, మరికొంతమంది బెల్లం లేదా జీలకర్ర మిశ్రమం వాడాలని సూచించారు.
పైలట్‌గా ముందు..
ప్రస్తుతానికి ఇది మరో 26 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకాబోతుంది. తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాల ఆధారంగా ఈ కొత్త ఆహార విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలుకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అభినందనీయం. రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ద్వారా పిల్లల ముఖాల్లో చిరునవ్వులు, ఆరోగ్యంగా ఎదుగే భరోసా ఇద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి
