Gurajada vs Chaganti: చాగంటికి గురజాడ విశిష్ట పురస్కారం.. నిరసనలకు పిలుపునిచ్చిన కళాకారులు, కవులు, సాహితీవేత్తలు..
మహాకవి గురజాడ అభ్యుదయవాది, హేతువాది అయితే గురజాడ భావజాలానికి విరుద్దమైన భావాలు గల చాగంటి కి ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. పురాణాలు చెప్పి అందరూ ఆ పాత రోజులకు వెళ్లాలని చాగంటి సూచిస్తారని.. గురజాడ మాత్రం గతాన్ని వదిలి ఉత్సాహం తో ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన మహాకవి అని చెబుతున్నారు.
ఒకరు హేతువాది.. అభ్యుదయ వాది..మరొకరు సాంప్రదాయక వాది.. ఆధ్యాత్మిక వాది.. ఒకరు గతించిన మేధావి..దేశ గతినే మార్చిన గొప్ప సామాజిక కర్త.. ఇంకొకరు ప్రవచనాలతో తెలుగు ప్రజలను విశిష్టంగా ఆకట్టుకుంటున్న ఆధ్యాత్మిక మేధావి. ఒకరు గురజాడ అప్పారావు..మరొకరు చాగంటి కోటేశ్వరరావు.. గురజాడ కాలం చేసి వందేళ్లు పైనే అయ్యింది. చాగంటి ప్రవచనాలతో ఊపేస్తున్నారు. అయినా ఇద్దరి విషయంలో ఓ వివాదం ఏర్పడింది. గురజాడకు ఘన నివాళి అర్పించాలనే ఉద్దేశ్యంతో 2000 సంవత్సరం నుంచీ ప్రతిఏటా అనేక మంది ప్రముఖులకు గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం చేస్తూ వస్తున్నారు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు..ఇది చాలా గొప్ప కార్యక్రమం. నవంబర్ 30 న గురజాడ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఇప్పటి వరకు.. జేవీ సోమయాయులు, గొల్లపూడి మారుతి రావు, డా సి. నారాయణ రెడ్డి, కే. విశ్వనాథ్,, గుమ్మడి, షావుకారు జానకి, మల్లెమాల, అంజలీ దేవి, సుద్దాల, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖులకు గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం చేశారు సభ్యులు.. ఈ ఏడాది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు కు ఈ పురస్కారాన్నిప్రధానం చేయాలనుకున్నారు నిర్వాహకులు.. అందుకు చాగంటి కూడా అంగీకరించారు.. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది..కానీ..చాగంటికి గురజాడ అవార్డు ఇవ్వాలనుకోవడంపైనే..ప్రముఖ కవులు, కళాకారులు, రచయితలు మండిపడుతున్నారు.
చాగంటికి గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. మహాకవి గురజాడ అభ్యుదయవాది, హేతువాది అయితే గురజాడ భావజాలానికి విరుద్దమైన భావాలు గల చాగంటి కి ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. పురాణాలు చెప్పి అందరూ ఆ పాత రోజులకు వెళ్లాలని చాగంటి సూచిస్తారని.. గురజాడ మాత్రం గతాన్ని వదిలి ఉత్సాహం తో ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన మహాకవి అని చెబుతున్నారు.
సతీసహగమనం తప్పని అలాంటి దురాచారాన్ని తూలనాడిన మహాకవికి, ప్రవచన కర్త చాగంటి కి పొంతన ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాలని అన్ని సంఘాలు నిర్ణయించుకున్నాయి. అంతటితో ఆగకుండా పలువురు సాహితీ వేత్తలు, రచయితలు, కవులు, కళాకారుల సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి..
గురజాడ పురస్కారాన్ని చాగంటికి ఇవ్వకూడదంటూ.. ఈ నెల 27 న గురజాడ ఇంటి నుంచే నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.. ప్రస్తుత పరిస్థితుల్లో.. చాగంటి నిర్ణయం ఏంటోనని పలువురు చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..