తెలుగుదేశం పార్టీ ఆధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వేడిని రాజేశారు. మన్నటి వరకూ సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా పొలిటికల్ సైరన్ మోగించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర వేదికగా ఈ సభను ఏర్పాటు చేశారు టీడీపీ ముఖ్య నాయకులు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు కూడా నవశకం సభకు హాజరయ్యారు.
ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల యుద్ధభేరిని మోగించాం.. మా కష్టాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని శపథం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్న పరిశ్రమలు పారిపోయాయన్నారు. జాబ్ క్యాలండర్ హామీని వైసీపీ సర్కార్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరోసారి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు. వైసీపీ కబ్జాలో ఉత్తరాంధ్రలో నలిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భావి తరాల భవిష్యత్తుకోసం రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
విశాఖలో గతంలో ఎప్పుడూ లేని అరాచకాలు పెరిగిపోయాయన్నారు. గంజాయికి విశాఖ రాజధానిగా మారిపోయిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉంటే 2020కి పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేవాళ్లమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని ఆరోపించారు. అబద్దాల పునాదులపై వైసీపీ ఏర్పడిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై వేధింపులు, తప్పుడు కేసులు పెడుతున్నారని.. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు. పోలీసుల మెడపై కత్తిపెట్టి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారంటూ ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలిపెట్టం అని హెచ్చరించారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి, తిరుపతిలో కూడా ఉమ్మడి సభలు నిర్వహిస్తామని చెప్పారు.
నారా లోకేష్ స్పందిస్తూ.. ఇది నవశకం.. యుద్ధం మొదలైందని ఈ యుద్ధం ఆగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇది యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే అని చంద్రబాబు, పవన్‌ను చూస్తే వైసీపీ నాయకులకు భయం పుడుతోందన్నారు. విజనరీ అంటే చంద్రబాబు అని ప్రశంసించారు. ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త పథకం తెచ్చారు. మా జీవితాలతో ఆడారని ప్రజలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడతాం అని లోకేశ్ వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..