
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, 24మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కొత్త కేబినెట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాకు మొండిచెయ్యి మిగిలింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక్కరే ఉన్న కేబినెట్‌లో మంత్రులుగా ఎవరికి చోటు దక్కపోవడంతో కేడర్‌కు నిరాశే మిగింది. కేబినెట్‌లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు మినహా ఎవరికీ చోటు దక్కకపోవడగంతో సొంత జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణం అయ్యింది. మంత్రి పదవిని ఆశించిన మాజీ మంత్రి అమర్, నల్లారి కిషోర్ ఇద్దరికీ కేబినెట్ బెర్త్ దొరుకుతుందని ఆశించారు. అయితే మంత్రిమండలంలో అవకాశం లభించకపోవడం జిల్లాలో చర్చ నడుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. అయితే నాలుగోసారి సీఎంగా భాద్యతలు చేపట్టిన ప్రభుత్వంలో బాబు మినహాయిస్తే ఇప్పుడు ఆ జిల్లాలో కేబినెట్‌లో స్థానమే దొరకని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేనంత మెజారిటీ స్థానాలను 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. అయితేనేం కేబినెట్ లో మాత్రం అవకాశం దక్కలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా 12 స్థానాలను కూటమి సొంతం చేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరులు మినహాయిస్తే జిల్లాలో టీడీపీకి తిరుగులేని మెజారిటీ లభించింది. 11 చోట్ల టీడీపీ, మరో స్థానంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లాను కైవసం చేసుకోవడంతో చంద్రబాబు కేబినెట్‌లో ఈసారి సముచితస్థానం ఉంటుందని పార్టీ కేడర్ భావించింది.
అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురైంది. పలమనేరు నుంచి ఎన్నికైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీలేరు నుంచి గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డికి, అన్నమయ్య జిల్లా నుంచి కిషోర్ కుమార్ రెడ్డికి కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అని పార్టీ కేడర్ కూడా భావించింది. అయితే చంద్రబాబుతో సహా ప్రమాణ స్వీకారం చేసిన 25 మందిలో వీరిద్దరికీ చోటు తగ్గకపోవడం చర్చగా మారింది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లా నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మరో 7 మంది ప్రమాణస్వీకారం చేయగా, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముగ్గురికి, ఇప్పటి దాకా మంత్రి పదవులు చేయని ఇద్దరికీ కేబినెట్‌లో అవకాశం దక్కింది.
కొత్త పాత కలయికల చంద్రబాబు కేబినెట్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తగిన ప్రాధాన్యత తగ్గలేదన్న అసంతృప్తి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకే కాకుండా పార్టీ క్యాడర్ లోను నెలకొంది. దీంతో ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాలో తమ పేర్లు ఉంటాయని భావించిన ఆశావాహులు, కనీసం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా హాజరుకాకుండానే వెనుతిరిగిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ కేడర్ కూడా అసంతృప్తితో ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టి, సొంత నియోజకవర్గాలకు రావాల్సి వచ్చింది. అయితే కేబినెట్ బెర్త్ లో మరొకరికి అవకాశం ఉందన్న సంకేతం ఉన్నా చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందన్న విషయం మాత్రం సందేహమే నంటున్న పార్టీ కేడర్.
అసలు అమర్, కిషోర్ లకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదన్న దాని పైనే చర్చించుకుంటున్నారు. అమర్, కిషోర్‌లలో ఒకరికి ఇస్తే, మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని అధిష్టానం భావించింది. కాబట్టే ఇద్దరికీ అధిష్టానం నో చెప్పింది అన్న చర్చ కూడా పార్టీ కేడర్ లో ఉంది. అయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గత ఐదేళ్లు రాయలసీమ జిల్లాల్లో పార్టీలోని నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారన్న పేరు ఉండగా, జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని, అధికారాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని నిలబడ్డారన్న పేరు నల్లారి కిషోర్ కు ఉంది. ఈ లెక్కన ఇద్దరికీ పార్టీ న్యాయం చేయాల్సి ఉండగా మంత్రి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టడం సరైనది కాదన్న చర్చ కూడా పార్టీ క్యాడర్ లో బలమైన చర్చ కొనసాగుతోంది. మరోవైపు చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైసీపీ తో ఫైట్ చేసి గెలిచిన పులివర్తి నాని కూడా మంత్రి పదవిని ఆశించినా కోరిక నెరవేరలేదు.
అయితే మంత్రి పదవులు దక్కకని అమర్, కిషోర్ ఇద్దరూ ముఖ్య అనుచరులతో అసంతృప్తి వ్యక్తం చేసినా మీడియా ముందుకు రాకుండా నియోజక వర్గానికి రాకుండా ఉండిపోవడం ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..