చంద్రబాబు చుట్టూ మరిన్ని కేసులు.. ఇవాళ ఏం జరగనుంది.? తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ..

|

Sep 25, 2023 | 7:38 AM

స్కిల్ స్కామ్ కేసు నుంచి ఎలా బయటపడాలా అని.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారు. కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లతో ఈ కేసు ముందుకెళ్తుంటే.. మరికొన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఆ కేసులకు సంబంధించిన పలు పిటిషన్లు ఇవాళ విచారణకు రాబోతున్నాయి.

చంద్రబాబు చుట్టూ మరిన్ని కేసులు.. ఇవాళ ఏం జరగనుంది.? తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ..
Chandrababu
Follow us on

స్కిల్ స్కామ్ కేసు నుంచి ఎలా బయటపడాలా అని.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారు. కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లతో ఈ కేసు ముందుకెళ్తుంటే.. మరికొన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఆ కేసులకు సంబంధించిన పలు పిటిషన్లు ఇవాళ విచారణకు రాబోతున్నాయి. వాటిల్లో అయినా చంద్రబాబుకు ఊరట దక్కుతుందా?

రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. ఆయన జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసుల మీద కేసులు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే 17 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారాయన. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో చంద్రబాబు వేసిన అన్ని పిటిషన్లలోనూ ఆయనకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తున్నారాయన. ఇదిలా ఉంటే మరికొన్ని కేసులను తిరగదోడే పనిలో ఉన్నారు సీఐడీ అధికారులు. వాటికి సంబంధించిన పలు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనీ.. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర నేరుగా ఉందని సీఐడీ అంటోంది. దీనికి సంబంధించి గతంలో నమోదైన కేసుల్లో విచారణ జరపాలంటూ ఇప్పటికే పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. అటు ఫైబర్ గ్రిడ్‌లోనూ అవకతవకలపైనా బాబును ఎంక్వైరీ చేయాలంటూ పీటీ వారెంట్ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్ట్ విచారణ జరపనుంది. ఇక చంద్రబాబుకు బెయిల్ పిటిషన్ పైనా ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

ఈ రెండు కేసుల్లో బాబు పాత్ర ఉందని సీఐడీ వాదిస్తుంటే.. రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని పిటి వారెంట్ పేరుతో కస్టోడియల్ ఎంక్వైరీకి ఇవ్వొద్దంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. వీటిపై కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు సుప్రీం కోర్టులోనూ కీలక విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేస్తూ.. రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. ఇది కూడా ఇవాళ విచారణకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయా పిటిషన్లపై ఎలాంటి తీర్పు రాబోతుందని తెలుగు రాష్ట్రాలలోని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

అక్టోబర్ 5 వరకు రిమాండ్:

మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించారు ఏసీబీ కోర్టు జడ్జి. రిమాండ్‌ను పొడిగించాలంటూ సీఐడీ పిటిషన్‌ వేయడంతో.. వాదోపవాదనలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి.. మరో 11 రోజులు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..