2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. జనవరిలో మొదటి విడత అభ్యర్ధులను ప్రకటించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇంచార్జిలు లేని స్థానాలకు కొత్త ఇంచార్జిలను నియమిస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. కీలకమైన స్థానాల్లో అభ్యర్ధులను మారుస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేసుల నుంచి రిలీఫ్ వచ్చిన కొన్నాళ్ళకు పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.సెప్టెంబర్ 9 వ తేదీన నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు చాలాకాలం దూరంగా ఉన్నారు. 52 రోజుల రిమాండ్ తర్వాత ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. నవంబర్ ఒకటో తేదీ తెల్లవారుజామున ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవడం, కంటికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దాదాపు నెలరోజుల విరామంతో మళ్ళీ ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టారు.
ఈలోగానే పార్టీకి సంబంధించి అంతర్గత నివేదికలు తెచ్చుకోవడం, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై కసరత్తు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి. విజయదశమి రోజు మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినా అది కూడా నెరవేరలేదు. ఇక జనసేన తో పొత్తు కుదరడంతో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ పై ఫోకస్ పెట్టాయి. ఇదంతా ఒకవైపు కొనసాగుతుండగానే పలు నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు స్పష్టత ఇస్తూ వస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ మంది ఆశావహులు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. నేరుగా అభ్యర్థిగా ప్రకటించకపోయినా ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం నియమిస్తున్న ఇంఛార్జీలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కన్ఫర్మ్ అయినట్లే అని తెలుస్తుంది. ఇటీవల నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్ ఎండీ ఫరూక్ ను ఇంచార్జిగా నియమించిన చంద్రబాబు.. తాజాగా కీలకమైన గుడివాడ స్థానానికి ఇంచార్జిగా వెనిగండ్ల రామును ఎంపిక చేసారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ముందుగా ఇంచార్జిల నియామకాలపై ఫోకస్ పెట్టారు. కొన్ని స్థానాలకు కొత్తగా ఇంచార్జిలను నియమించడంతో పాటు గతంలో ఉన్న కొంతమందిని మారుస్తూ నిర్నయం తీసుకుంటున్నారు. గత మూడు నెలలుగా క్షేత్ర స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ పరిస్థితితో పాటు అభ్యర్ధులకు సంబంధించి గెలుపోటములపైనా స్వయంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎక్కడైనా ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు సీటుపై ఆశ పెట్టుకుంటే వారిపై దృష్టి పెట్టారు. అలాంటి నాయకులను స్వయంగా పిలిచి మాట్లాడి గ్రూపు తగాదాలు లేకుండా ఒకరికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. నంద్యాల టిక్కెట్ ఈసారి ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలని చంద్రబాబు నిర్నయించారు. దీంట్లో భాగంగా ఇటీవల ఎన్ ఎండీ ఫరూక్ ను ఇంచార్జిగా నియమించారు. ఇక్కడ టిక్కెట్ రేస్ లో ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డికి బదులు ఫరూక్ కు బాధ్యతలు అప్పగించారు. ఇద్దరిని పిలిచి వారితో చర్చించిన తర్వాతే ఈ నిర్నయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరో కీలక స్థానం కృష్ణా జిల్లా గుడివాడ. .ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. వరుసగా నాలుగు సార్లు కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు టీడీపీపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కొడాలి. అందుకే ఈ స్థానంలో ఎలాగైనా పాగా వేసేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు స్థానంలో ఎన్నారై వెనిగండ్ల రాముకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాముతో పలుమార్లు చర్చించిన తర్వాతే చంద్రబాబు ఈ నిర్నయం తీసుకున్నారు. వెనిగండ్ల రాము గత ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉంటూ అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్తున్నారు.
సామాజిక వర్గాల ప్రకారం కూడా వెనిగండ్ల రాముకు కలిసొచ్చే అంశాలున్నాయి. పలు సామాజిక,సేవా కార్యక్రమాలతో పాటు టీడీపీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో కూడా వెనిగండ్ల రాము కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల టీడీపీ నాయకులు, కేడర్ ను తనకు దగ్గర చేసుకున్నారు వెనిగండ్ల రాము. కొడాలి నానిని ఢీకొట్టడానికి రాము అయితే కరెక్ట్ అని భావించిన చంద్రబాబు ఆయనకు బాధ్యతలు కట్టబెట్టారు. ఇక అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సియ్యారి దొన్ను దొరను.. అరకు పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ను నియమించారు. ప్రస్తుతం ఇంచార్జిలుగా నియమిస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో దాదాపు సీట్లు ఖరారు చేసినట్లే అని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అన్ని స్థానాలకు ఇంచార్జిలను నియమించేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా అన్ని అసెంబ్లీ, పార్టమెంట్ స్థానాలకు ఇంచార్జిల నియామకాలను పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో ఉన్న ఇంచార్జిల పనితీరు ఆధారంగా కొత్తవారిని నియమించే ఆలోచనలో ఉన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఉన్న ఇంచార్జిలలో చాలా మందిని అభ్యర్ధులుగా ప్రకటిస్తారని తెలుస్తోంది. జనవరి నెలలో మొదటి విడత అభ్యర్ధుల ప్రకటన చేసేలా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో గ్రూపు తగాదాలు లేకుండా సీట్లు ఆశిస్తున్న అభ్యర్ధులకు ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఆఫర్ చేస్తున్నట్లు కూడా తెలిసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..