Andhra Pradesh: ఏపీ మీదుగా మరో హైస్పీడ్ కారిడార్.. ఈ రూట్లోనే నిర్మాణం.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
ఏపీకి కేంద్రం ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. మరో హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ఏపీ మీదుగా ప్రకటించింది. ఇది అమరావతి మీదుగా వెళ్లనుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చెన్నైకి వెళ్లనుంది. ఈ కొత్త జాతీయ రహదారి రాకతో రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలగనుంది.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి పలు కీలక కేటాయింపులు జరిగాయి. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పాటు ఏపీ మీదుగా పలు హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. ఈ క్రమంలో ఏపీకి మరో హైస్పీడ్ కారిడార్ ప్రకటించింది. కోల్‌కత్తా-చెన్నై నేషనల్ హైవే ప్రస్తుతం ఏమీ మీదుగా వెళ్తుంది. దీనికి సమాంతరంగా కొత్త హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త జాతీయ రహదారి పశ్చిమబెంగాల్‌లని ఖరగ్‌పూర్ నుంచి ప్రారంభమవుతుంది. ఏపీ మీదుగా చెన్నైకు వెళుతుంది. ఇప్పటికే దీని ఎలైన్‌మెంట్‌పై కసరత్తు జరుగుతోండగా.. త్వరలో సలహా సంస్థలను ఎంపిక చేయనుంది.
అమరావతికి కీలకం
ఈ హైస్పీడ్ రోడ్డు కారిడార్ రాష్ట్ర రాజధాని అమరావతికి కీలకం కానుంది. విశాఖపట్నానికి కొంత దగ్గరగా ఈ హైవే వెళ్లనుండగా.. విజయవాడ సమీపంలోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కలవనుందని తెలుస్తోంది. అలాగే గుంటూరు తర్వాత అదే ఔటర్ రింగ్ రోడ్డులో మళ్లీ కలిసేలా ఎలైన్‌మెంట్ ఉంటుందని సమాచారం. ఆ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చెన్నై వరకు ఉంటుందని తెలుస్తోంది. గ్రీన్‌ఫీల్డ్‌తో యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. కోల్‌కత్తా-చెన్నై హైవే వాహనాలతో ప్రస్తుతం పూర్తి రద్దీగా ఉంటుంది. దీనిని విస్తరించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు దానికి సమాంతరంగా హైస్పీడ్ కారిడార్ నిర్మాణం కానుండటంతో భవిష్యత్తులో వివిధ ప్రాంతాల నుంచి అమరావతికి రావడానికి సులువవుతుంది. ప్రస్తుతం ఎలైన్‌మెంట్ తయారీ సిద్దమవుతుండగా.. నెల రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. ఆ తర్వాత హైవే వెళ్లే రాష్ట్రాలతో చర్చలు జరిపి తుది ఎలైన్‌మెంట్ ఖరారు చేయనున్నారు.
రైల్వే ప్రాజెక్టులు
ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులు కేంద్రం చేపడుతోంది. కోల్‌కత్తా-చెన్నై మార్గాన్ని నాలుగు లైన్ల కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఏపీలో మూడు లైన్ల కారిడార్‌గా ఇది ఉండనుండగా.. ఒడిశాలో నాలుగు లైన్లుగా ఉందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అటు ఏపీలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా ఆధునీకరిస్తున్నారు. ఇక కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ రైల్ కారిడార్లు పూర్తయితే బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోనే చేరుకోవచ్చు. ఇక అమరావతి నుంచి చెన్నైకు రెండో గంటల్లో ప్రయాణించవచ్చు. ఇక అనంతపురం నుంచి హైదరాబాద్‌కు 90 నిమిషాల్లో చేరుకోవచ్చని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయని స్పష్టం చేశారు.
