పాపం పెళ్లిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ప్రసాదు.. తాళి కట్టే టైంకి సినిమాను మించిన ట్విస్ట్..
సాధారణంగా పెళ్లి ఆగిపోవడం సీన్‌లు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఎవరో మధ్యలో వచ్చి వివాహాన్ని ఆపేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. పెళ్లిపై ఎన్నో కలలు పెట్టుకున్న వరుడికి చివరి క్షణంలో పెళ్లికూతురు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆంతకూ ఆ పెళ్లిలో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వైఎస్‌ఆర్ కడప జిల్లా, 21 ఆగస్ట్: ఆ ఇంట్లో మూడుముళ్ళ బంధానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్నో ఏళ్లుగా కంటున్న తన కల నిజం కాబోతుందని పెళ్లి కోడుకు ఎంతో సంబంరంలో ఉన్నారు. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్.. పెళ్లి కూతురి నుంచి మెసేజ్, ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్. దీంతో షాకైన పెళ్లికొడుకు మోసపోయానని గ్రహించాడు. తాళి కట్టే సమయానికి వధువు పరారవడంతో బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు.
అసలేం జరిగింది?
కడప జిల్లా వేంపల్లికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి, పులివెందుల పశుసంవర్ధక శాఖలో పనిచేస్తూ కడప నుంచి రాకపోకలు సాగించే ఓ మహిళతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. చాలా కాలంగా వివాహం కాక ఎదురుచూస్తున్న ప్రసాద్‌తో ఆమె చనువు పెంచుకుంది. ఇద్దరూ కలిసి పలు ప్రాంతాలకు లాంగ్ ట్రిప్పులు వెళ్లడంతో పాటు, ఆమె ప్రసాద్ కుటుంబ సభ్యులతోనూ సన్నిహితంగా మెలిగింది. ఈ క్రమంలో పెళ్లికి అంగీకరించడంతో, ప్రసాద్ ఆమె కోసం రూ. 1.50 లక్షల విలువైన పెళ్లి బట్టలతో పాటు ఏడాది కాలంలో దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశాడు.
ముహూర్తం సమయానికి ట్విస్ట్
బుధవారం తెల్లవారుజామున ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో వివాహం జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సమయం దగ్గరపడుతున్నా పెళ్లికూతురు రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన ప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కాసేపటికి “నేను ఈ పెళ్లి చేసుకుంటే మా అమ్మానాన్న ఉరివేసుకొని చనిపోతారు, అందుకే వెళ్లిపోతున్నాను.. సారీ” అని చిన్న మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సదరు మహిళకు గతంలోనే ఇద్దరితో వివాహమై ప్రస్తుతం ఒంటరిగా ఉంటోందని, ఇలాంటి మోసాలకు పాల్పడిన ట్రాక్ రికార్డు ఆమెకు ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రసాద్ బంధువు వద్ద కూడా ఆమె రూ. 40 వేల వరకు తీసుకుని మోసం చేసినట్లు తెలిసింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న వేంపల్లి పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
