ఏపీలో బీజేపీ కథ మళ్లీ మొదటికొచ్చింది. 2014లో లాగా పొత్తుల బాట పట్టాలా…2019 ఎన్నికల్లో మాదిరి ఒంటరి పోరు చేయాలా అనే సందిగ్ధావస్థలో ఉంది కాషాయ పార్టీ. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. అధికారం పంచుకున్నాయి. ఆ తర్వాత విభేదాలతో రాం రాం అనుకుంటూ 3 పార్టీల కూటమి మూడు ముక్కలైంది. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ…మూడు విడివిడిగా పోటీ చేసి చావు దెబ్బ తిన్నాయి. ఘోర ఓటమిని చవి చూశాయి. దీంతో మళ్లీ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన ముందుకొస్తోంది.
ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కూటమి కట్టే విషయంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయం కోరింది. ముఖ్యంగా 2014 తరహాలో ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రతిపాదన చర్చకు వచ్చింది. పొత్తుల గురించి ముందు రాష్ట్ర నాయకత్వం మదిలో ఏముందో తెలుసుకోవాలని అధిష్టానం ఆరా తీసింది. ఇప్పటికే AP నుంచి NDA కూటమిలో ఉన్న జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోందని రాష్ట్ర నేతలు…కేంద్ర నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. మరోవైపు బీజేపీకి 5 నుంచి 6 లోక్‌సభ సీట్లు, 10 నుంచి 12అసెంబ్లీ సీట్లు టీడీపీ ఆఫర్ చేసినట్టు తెలిసింది. అయితే పొత్తు కుదిరితే 8 నుంచి 10 వరకు లోక్‌సభ సీట్లు ఆశించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఏపీ బీజేపీ చీఫ్ ఫురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా, జీవీఎల్ వంటివాళ్లు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళదామంటున్నారని సమాచారం. పార్టీలోకి వచ్చిన కొత్త కాపులు పొత్తుల కోసం తహతహలాడుతుంటే…పార్టీనే నమ్ముకుని ఉన్న పాత కాపులు మాత్రం ఒంటరి పోరు బాట పట్టాలంటున్నారట. అయితే ఏపీలో పొత్తులపై అంతిమ నిర్ణయం జాతీయ నాయకత్వమే తీసుకుంటుందని జీవీఎల్ వంటి నేతలు చెబుతున్నారు. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావించే బీజేపీ అగ్రనేతలు, కీలక నిర్ణయాలను అప్పుడే తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏపీలో బీజేపీ పొత్తులతో వెళుతుందా లేక ఒంటరిగా వెళుతుందా అనేది సంక్రాంతి తర్వాతే తేలే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాతే ఈ సస్పెన్స్‌కు తెర పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..