Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గెలుపుపై జోరుగా సాగుతున్న బెట్టింగ్స్.. బొబ్బిలి ఎన్నికల యుద్ధంలో రాజు ఎవవరు..?

చారిత్రక బొబ్బిలిలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. బొబ్బిలిలో ఎన్నికలు మరో బొబ్బిలి యుద్ధాన్నే తలపించాయి. అధికార పార్టీ సంక్షేమ పథకాలు, కాస్ట్ కార్డ్ వర్సెస్ బొబ్బిలి రాజుల చరిష్మా అన్నట్లు సాగాయి.

Andhra Pradesh: గెలుపుపై జోరుగా సాగుతున్న బెట్టింగ్స్.. బొబ్బిలి ఎన్నికల యుద్ధంలో రాజు ఎవవరు..?
Bobbili Constituency
Follow us
G Koteswara Rao

| Edited By: Balaraju Goud

Updated on: Jun 02, 2024 | 1:18 PM

చారిత్రక బొబ్బిలిలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. బొబ్బిలిలో ఎన్నికలు మరో బొబ్బిలి యుద్ధాన్నే తలపించాయి. అధికార పార్టీ సంక్షేమ పథకాలు, కాస్ట్ కార్డ్ వర్సెస్ బొబ్బిలి రాజుల చరిష్మా అన్నట్లు సాగాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సాగిన బొబ్బిలి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? జరిగిన ఎన్నికల్లో అక్కడ ప్రభావితం చేసిన పరిస్థితులు ఏంటి? తాజా రాజకీయాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతుంది.

ఒకప్పుడు బొబ్బిలిలో బొబ్బిలి యుద్ధం హోరాహోరీగా జరిగితే ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల యుద్ధం కూడా ఇక్కడ అలాగే సాగింది. ప్రధాన రాజకీయపార్టీలైన టీడీపీ, వైసీపీల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. ఇక్కడ అధికార వైసీపీ నుండి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు బరిలో దిగగా, ప్రతిపక్ష టీడీపీ నుండి బొబ్బిలి రాజకుటుభీకులు అయిన బేబీ నాయన పోటీలో ఉన్నారు. రాజకీయాల్లో ఇద్దరు సీనియర్లే అయినా ఎమ్మెల్యే శంబంగి మాత్రం డైరెక్ట్ పాలిటిక్స్ లో నలభై ఏళ్లకు పైగానే ఉన్నారు. శంబంగి బొబ్బిలి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా, ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన శంబంగి వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, వివాదరహితుడుగా పేరుంది. 2019లో వైసీపీ నుండి గెలిచిన శంబంగి 2024 లో కూడా బొబ్బిలి నుండి బరిలోకి దిగారు.

ఇక్కడ టీడీపీ నుండి బొబ్బిలి యువరాజాగా పిలిచే బేబినాయన ఎన్నికల బరిలో ఉన్నారు. 2004 సమయంలో మునిసిపల్ చైర్మన్‌గా పనిచేసిన బేబినాయన రాజకీయాల్లో దిట్ట.. ఈ నియోజకవర్గంలో ఈయన సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావు 2004 నుండి 2014 వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే సుజయ్ గెలిచే ప్రతి ఎన్నికల్లో బెబీనాయన పాత్రే కీలకం. గ్రామస్థాయి నుండి బేబినాయనకు గట్టి పట్టు ఉంది. గ్రౌండ్ లెవల్ నుండి పబ్లిక్ ను పేరు పెట్టి పిలిచే చనువు ఉన్న నేత.. ఇప్పటివరకు తెర వెనుక రాజకీయాలు చేసిన బేబినాయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థితో నేరుగా తలపడ్డారు.

బేబినాయన ఆర్దికంగా బలమైన నేత, రాజుల చరిష్మా ఈయనకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా సొంత నిధులతో సైతం నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. ఎమ్మెల్యే శంబంగితో వ్యక్తిగత వైరం లేనప్పటికీ, రాజకీయపరమైన పోరు వీరిద్దరి మధ్య గట్టిగానే కొనసాగింది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఈ సారి కాస్ట్ కార్డ్ తెర మీదకి వచ్చింది. శంభంగి కొప్పలవెలమ కావడం, టీడీపీ అభ్యర్ధి బేబినాయన వెలమ దొరలు కావడంతో ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేసేలా సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి పావులు కదిపారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపోటములో ఈ సామాజిక వర్గం వారే కీలకం కావడంతో శంబంగి తన సామాజికవర్గ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఇక్కడ కొప్పల వెలమతో పాటు కాపులు, ఇతర కులాల వారు కూడా రాజకీయాల్లో కీలకంగానే ఉన్నారు. అయితే ఇక్కడి బొబ్బిలి రాజులు వెలమ దొరలు అయినప్పటికీ నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా వీరు చేసిన సర్వీస్, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వీరి చరిష్మా రాజులకు ప్లస్ పాయింట్‌గా మారింది. అంతేకాకుండా 2004 నుండి రాజకీయాల్లో ఉండి నియోజకవర్గంలో ఎన్నో సేవలు అందించిన బేబినాయనకు గత ఇరవై ఏళ్లుగా ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. దీంతో మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న బేబినాయన తనకు ఒక అవకాశం ఇవ్వాలన్న నినాదం ప్రజల్లో బాగానే వర్కవుట్ అయిందనే చెప్పాలి.

శంబంగి కులం కార్డు, సంక్షేమపథకాలతో ఎన్నికల్లోకి వెళ్తే బొబ్బిలి రాజులుగా తమకున్న చరిష్మా, ప్రభుత్వ వ్యతిరేక, ఒక్క అవకాశం ఇవ్వాలన్న నినాదాన్ని బేబీనాయన ఎన్నికల్లోకి వెళ్లారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారన్న అంశం పై జిల్లాలో కోట్లాది రూపాయల బెట్టింగ్స్ సాగుతున్నాయి. అయితే ఇరు పార్టీల నాయకులు బెట్టింగ్స్ జోలికి వెళ్లొద్దని రిక్వెస్ట్ చేస్తున్న పందెంరాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొద్ది గంటల్లో రానున్న ఎన్నికల ఫలితాల్లో బొబ్బిలి విజేత ఎవరన్న అంశం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..