Bears hulchul in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఏపీలోని పార్వతీపురం జిల్లా కురుపాం మండలంలో ఎలుగుబంటి సంచారం ఆందోళన కలిగిస్తోంది. జీఎంవలస పంచాయతీ, సూర్యనగర్ పొలిమేరలో ఎలుగుబంటిని చూసినట్లు చెబుతున్నారు స్థానికులు. ఓ పాములపుట్టను ఎలుగుబంటి కాలితో తవ్వేసినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థాలానికి చేరుకుని ఎలుగుబంటి ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. సూర్యనగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు అటవీశాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హడలెత్తించింది. ఎలుగు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒంగోలు జిల్లాలో ఎలుగు కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. త్వరగా ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండల కేంద్రంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. బస్టాండ్‌కు ఆనుకుని ఉన్న కొండపై సంచరిస్తుంది. ఎలుగుబంటి సంచారంతో ఆందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు.
తెలంగాణలోనూ ఎలుగుబంట్లు స్వైరవిహారం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనూ ఎలుగు టెన్షన్ పెడుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎలుగు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..