కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తు పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. మంగళవారం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా…ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడుతూ.. 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం జరుగుతుందని వెల్లడించారు. కొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు. కౌంటింగ్ సూపర్ వైజర్, మైక్రో అజ్వర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ 233, సర్వీస్ ఓటర్లు ముందుగా లెక్కగడుతామని తెలిపారు. వీటి ఫలితాలు 8 గంటల తర్వాత వస్తాయన్నారు.
మొత్త పది రౌండ్స్ లో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకే కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేసింది వైసీపీ పార్టీ. మెజార్టీ మాత్రం తగ్గిస్తామని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2, 15, 392 ఉండగా…1,46,562 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
బద్వేల్ బరిలో 15మంది అభ్యర్ధులున్నా… ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే. గత ఎన్నికల్లో లక్షా 58వేల ఓట్లు పోలైతే అందులో 60శాతం ఓట్లు ఒక్క వైసీపీకే వచ్చాయ్. బీజేపీ, కాంగ్రెస్‌కి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది.
ఇవి కూడా చదవండి: PM Modi: విదేశాల నుంచి రావడమే ఆలస్యం 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..
LPG Price Rise: దీపావళి ముందు భారీ షాక్.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర.. ఎంత పెరిగిందంటే..