Badvel By-Election: బద్వేలు బైపోల్స్‌లో జనసేనతో బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

|

Sep 30, 2021 | 5:39 PM

కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు.

Badvel By-Election: బద్వేలు బైపోల్స్‌లో జనసేనతో బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు
Pawan Kalyan, somu veerraju
Follow us on

కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై బీజేపీ, జనసేన పార్టీ నేతలు సమావేశమై చర్చించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పవన్ కల్యాణ్,  నాదెండ్ల మనోహర్‌, సోము వీర్రాజు, మధుకర్‌లు పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో పొత్తులు, గట్టి పోటీ ఇచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.   భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. తాము కచ్చితంగా బద్వేలు ఉప ఎన్నికల బరిలో నిలుస్తామని తేల్చిచెప్పారు. అయితే ఏ పార్టీ నుండి అభ్యర్థి బరిలో నిలుస్తారన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

బద్వేలు ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ తరపున గెలుపొందిన వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఉపఎన్నికల్లో ఆయన సతీమణి డాక్టర్‌ దాసరి సుధను వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థిగా వైసీపీ బరిలో నిలపనుంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్‌ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. బద్వేలు(ఎస్సీ రిజర్వుడ్) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించి.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నియోజకవర్గంలో 2,04,618 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,02,811 మంది పురుషులు, 1,01,786 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

హైదరాబాద్‌కు తిరుగుపయనమైన పవన్..
సోము వీర్రాజుతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఎల్లుండి(అక్టోబర్ 2) నేరుగా పవన్ కల్యాణ్ రాజమండ్రికి చేరుకోనున్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేస్తారని ఇది వరకే ప్రకటించారు. అయితే శ్రమదానం కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

Also Read..

ap covid 19 Cases: ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 1,010 మందికి పాజిటివ్.. 13 మంది మృతి

పెళ్లి చేసుకుంటే రూ 3.70 కోట్లు ఎదురు కట్నం ఇస్తా.. మోడల్ కు అరబ్ షేక్ ఆఫర్.. వీడియో