Women Free Bus Scheme: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ నుంచి బిగ్ అప్డేట్.. ఇకపై రద్దీ ఉండదు..

రాష్ట్రంలోని బస్సు ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలో ఏకంగా 2,500 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. మహిళల ఉచిత బస్సు పథకం మెరుగ్గా అమలు చేసేందుకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో రద్దీ కారణంగా మహిళలకు సీట్లు ఉండటం లేదు.

Women Free Bus Scheme: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ నుంచి బిగ్ అప్డేట్.. ఇకపై రద్దీ ఉండదు..
Apsrtc

Updated on: Feb 03, 2026 | 7:50 AM

ఏపీలోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలో ఏపీఎస్‌ఆర్టీసీ భారీ సంఖ్యలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. త్వరలో ఏకంగా 2500 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ ఎంటీ కృష్టబాబు తెలిపారు. సోమవారం ఆర్టీసీ హౌస్‌లో ఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్టీసీ సేవలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీని వల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గనుండగా.. ఎక్కువమంది ప్రయాణించే సౌకర్యం కలగనుంది. అలాగే మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని సౌకర్యవంతంగా పొందేందుకు ఈ కొత్త బస్సులు సహకరించనున్నాయి.

కొత్తగా ఎన్ని బస్సులంటే..?

ఏపీలో త్వరలోనే 2,500 కొత్త బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ ఎంటీ కృష్ణబాబు ప్రకటించారు. పీఎం ఈ-బస్ పథకంలో భాగంగా త్వరలో ఏపీకి 1050 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వీటితో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1450 ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులను కొత్తగా తీసుకురానుంది. ఇవన్నీ కలిపితే మొత్తం 2,500 బస్సులు కానున్నాయి. వీటి రాకతో ఏపీఎస్‌ఆర్టీసీలో బస్సుల సామర్థ్యం మరింత పెరగనుండగా.. ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలగనుంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సీట్లు ఖాళీగా ఉండటం లేదు. దీంతో మహిళల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల మిగతా ప్రయాణికులకు సీట్లు ఉండటం లేదు. ఈ కొత్త బస్సుల రాకతో ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకునే మహిళలతో పాటు మిగతవారికి కూడా లాభం జరగనుంది.

ఈ ఏడాదే కొత్త బస్సులు

ఈ ఏడాది చివరికల్లా కేంద్రం అందించే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులు కూడా ఈ ఏడాదే ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఈ ఏడాది ఆర్టీసీ చరిత్రలో కొత్త ఆధ్యాయం మొదులుకానుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా బస్సులు కాలం చెల్లిపోవడం వల్ల నిర్వహణ కష్టమవుతుంది. ప్రయాణం మధ్యలో ఆగిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త వాటిని తీసుకురానున్నారు. కాగా ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా తిరుమలరావు స్థానంలో కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు సౌక్యవంతమైన ప్రయాణం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.