Andhra Pradesh: చంద్రబాబును కలిసిన చాగంటి.. ప్రవచనకర్తను ఏపీ సీఎం ఏం కోరారంటే..?

| Edited By: Shaik Madar Saheb

Nov 25, 2024 | 8:26 PM

ప్రభుత్వ సలహాదారులుగా ఇటీవల నియమితులైన ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశం అనంతరం చాగంటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు.

Andhra Pradesh: చంద్రబాబును కలిసిన చాగంటి.. ప్రవచనకర్తను ఏపీ సీఎం ఏం కోరారంటే..?
Chaganti Koteswara Rao Meets CM Chandrababu Naidu
Follow us on

ప్రభుత్వ సలహాదారులుగా ఇటీవల నియమితులైన ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశం అనంతరం చాగంటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలనీ, విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అదే సమయంలో లోకేష్ తో కలిసి విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నానన్న చాగంటి తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాగంటి కోటేశ్వరరావు తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని, ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనను సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని అన్నారు.

ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని.. వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు సీఎం చంద్రబాబు.. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.

బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తా: చాగంటి

గతంలో ఇదే పోస్ట్ ను 2014-19 మద్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇస్తే సున్నితంగా తిరస్కరించిన చాగంటి.. ఈసారి ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో స్వీకరిస్తానన్నారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానన్న చాగంటి కోటేశ్వరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి సీఎం వద్దకు వచ్చారు. తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరావును సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు..

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..