YSR Kalyanamasthu : ఏపీ ప్రభుత్వం మరో రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 30న లాంఛనంగా ప్రారంభించారు. వెబ్ సైట్ లాంఛ్ అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ..
పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాకుండా, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల దరఖాస్తు చేసుకునే వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. వివాహ తేదీకి వధువు వయసు 18, వరుడి వయసు 21 కచ్చితంగా నిండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. చదువును ప్రోత్సహించేందుకే పదో తరగతి పాస్ నిబంధన అమలు చేస్తున్నామని తెలిపింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులకు ఆర్థిక సాయం భారీగా పెంచింది. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తులో భాగంగా ఎస్సీలకు రూ.1,00,000, ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్టీలకు రూ.1,00,000, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బీసీలకు రూ.50,000, బీసీల కులాంతర వివాహాలకు రూ.75,000, వైఎస్సార్ షాదీ తోఫా కింద.. ముస్లిం మైనారిటీలకు రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, వీళ్లకేగాక భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 ల ఆర్థిక సాయాన్ని పెళ్లి కానుకగా అందించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి