ఏపీ ప్రజలకు అలర్ట్.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలర్ట్. నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, రాగల మూడు రోజుల పాటు ఈదురు గాలుల బీభత్సం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శనివారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం మరింత బలపడింది. ఆదివారం ఉదయం 08:30 గంటల సమయానికి ఇది వాయుగుండంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కి.మీ., చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కి.మీ., పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-నైరుతిగా 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
ప్రాంతాల వారీగా రాగల మూడు రోజుల వాతావరణ సూచన..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:
ఈ వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాపై తీవ్రంగా ఉండనుంది. ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఉరుములు, మెరుపుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తీరప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. సోమవారం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు కొనసాగుతాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
ఆది, సోమవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఎల్లుండి వాతావరణంలో పెద్దగా మార్పు ఉండదు. కొన్ని చోట్ల వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ
కోస్తా తీరంతో పోలిస్తే రాయలసీమలో వాయుగుండం ప్రభావం తక్కువగా ఉంటుంది. మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ప్రజలకు, మత్స్యకారులకు జాగ్రత్తలు
తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటం, సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
