వడ్డీ కట్టలేదని దారుణం.. ఆరు నెలల పసికందుతో తల్లిని బంధించిన వ్యాపారి.. చివరకు ఏమైందంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అప్పు వడ్డీ చెల్లించలేదనే కారణంతో వ్యాపారి ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆరు నెలల పసికందుతో సహా మహిళను బలవంతంగా తీసుకెళ్లి నిర్బంధించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వ్యాపారి ఇంటిపై దాడి చేసి తల్లీబిడ్డలను విడిపించారు. అయితే నిర్బంధంపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై డీఎస్పీ వివరణ ఇచ్చారు.

ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది.. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదనే కారణంతో ఆరు నెలల పసికందుతో సహా తల్లీబిడ్డలను బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో బంధించడం శ్రీకాళహస్తిలో కలకలం రేపింది. వ్యాపారి ప్రసాద్ దురాగతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఆది అనే వ్యక్తి రెండేళ్ల క్రితం వ్యాపారి ప్రసాద్ దగ్గర లక్షన్నర అధిక వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. ఆరు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో ఆది వడ్డీ కట్టలేకపోయాడు. డబ్బుల కోసం ప్రసాద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆది లిఫ్ట్ చేయకపోవడంతో వడ్డీ వ్యాపారి ప్రసాద్, అతని కొడుకు మోహన్ కలిసి ఆది ఇంటికి వెళ్లారు. అప్పు తీర్చే వరకు వదిలేది లేదంటూ ఆది భార్యను, ఆరు నెలల పసికందును బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్ ఇంటిపై దాడి చేసి, నిర్బంధంలో ఉన్న తల్లీబిడ్డలను సురక్షితంగా విడిపించారు. అయితే బాధితుడు ఆది, నిందితుడు ప్రసాద్ బంధువులు కావడంతో కేసు నమోదు చేసి పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
డీఎస్పీ ఏం చెప్పారంటే..
మరోవైపు శ్రీకాళహస్తిలో వడ్డీ వ్యాపారుల ఆగడాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. బాధితురాలు మేఘమాల ఇచ్చిన ఫిర్యాదులో కేవలం వడ్డీ డబ్బుల కోసం ఒత్తిడి చేశారని మాత్రమే ఉందని, ఎక్కడా బలవంతంగా తీసుకెళ్లి బంధించారని లేదని శ్రీకాళహస్తి డీఎస్పీ పావని స్పష్టం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తప్పనిసరి అని, అందుకే స్టేషన్ రిసీప్ట్ ఇచ్చామని డీఎస్పీ చెప్పారు.
కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
