జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టును చేరింది. వైసీపీ సర్కారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన అక్రమ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ టీడీపీ అధినేత దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చడం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపున న్యాయవాదులు శనివారంనాడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 (A) చంద్రబాబుకు వర్తిస్తుందని ఈ పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. ACB కోర్టు జారీ చేసిన రిమాండ్‌ను కొట్టేయాలని కూడా ఈ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు మెన్షన్ చేసి వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అటు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తమ వాదనలను సమర్థవంతంగా వినిపించేందుకు సీఐడీ తరఫు న్యాయవాదులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా స్కిమ్ స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీకి ధీటుగా ఈ కేసులో సుప్రీంకోర్టులో తమ వాదనలను సమర్థవంతంగా వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను ఏపీ సీఐడీ రంగంలోకి దించనుంది.
సీఐడీ కస్టడీకి చంద్రబాబు..
ఏసీబీ కోర్టు అనుమతి మేరకు శనివారం ఉదయం చంద్రబాబుకు వైద్య పరీక్షల అనంతరం.. స్కిల్ స్కామ్‌లో ఆయన్ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు షరతుల మేరకు సాయంత్రం 5 గం.ల వరకు మాత్రమే విచారణ కొనసాగుతుంది. అలాగే కోర్టు ఆదేశాల మేరకు ప్రతి గంటకు విచారణకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చి.. తన న్యాయవాదిని సంప్రదించేందుకు చంద్రబాబుకు అనుమతి ఇవ్వనున్నారు. 12 మందితో కూడిన సీఐడీ బృందం రెండు రోజుల పాటు చంద్రబాబును ప్రశ్నించనుంది. దీనికోసం 120 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోనే సీఐడీ విచారణ జరుగుతోంది.
చంద్రబాబుకు మరో చుక్కెదురు
ఇదిలా ఉండగా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకి మరో చుక్కెదురయ్యింది. రెండ్రోజుల సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని విచారించేందుకు న్యాయమూర్తి తిరస్కరించారు.
కొనసాగుతున్న టీడీపీ నిరసనలు
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే అక్రమ కేసులతో తమ పార్టీ నేతలను వైసీపీ సర్కారు అరెస్టు చేయిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సర్కారుపై పోరాడేందుకు అందరూ కలిసిరావాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశ, విదేశాల్లో టీడీపీ శ్రేణులు, మద్ధతుదారులు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును ఏపీ సర్కారు ఇబ్బందిపెడుతోందని ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి