ఏపీలో లోకల్ ఎన్నికల పంచాయతీపై ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుండగా… మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనడం కష్టమే అన్న అభిప్రాయంతో ఉన్న అధికారులు.. జిల్లాల్లో మాత్రం విధుల్లో పాల్గొనేందుకే ఆసక్తి చూపిస్తున్నట్టగా కనిపిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. అమలాపురంలో స్థానిక అధికారులు ఎన్నికలకు సిద్దమవుతున్నారు. అమలాపురం రెవెన్యూ డివిజన్‌లోని 6 మండలాల్లో 273 పంచాయతీలకు మొదటిదశలోనే ఎన్నికలు ఉన్నాయి. ఇందులో భాగంగా రేపటి నుండి నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. లీడర్ల విగ్రహాలకు ముసుగేసిన అధికారులు.. ఎన్నికల పోస్టర్లకు మాస్కులు కూడా వేశారు. ముందు నుంచి ఎన్నికలకు సిద్దంగా లేమని చెబుతూ వస్తున్న అధికారులు.. వీటిని చూస్తుంటే మాత్రం హాజరవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రేపటి నుంచి నామినేషన్లు మొదలు కానున్న నేపథ్యంలో అభ్యర్దులు కూడా అందుకు సిద్దమవుతున్నట్టుగా కనిపిస్తోంది. రహస్యంగా సమావేశాలను నిర్వహిస్తున్న స్థానిక నేతలు.. పోటీలో దిగేందుకే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అధికారులు కూడా జూమ్ యాప్ ద్వారా పాల్గొనడం కూడా ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది.
రేపటి పంచాయతీల దగ్గర నామినేషన్ల స్వీకరణకు అవసమైన సామాగ్రి ఇప్పటికే మండల పరిషత్‌ల ద్వారా చేరవేస్తున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నిన్ననే అధికారులకు పలు సూచనలు కూడా చేసినట్టుగా సమాచారం. అయితే, కలెక్టర్ ఇంత వరకు నోటిఫికేషన్ జారీచేయకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుండగా.. కిందిస్థాయి సిబ్బంది కూడా ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు.