AP Rains Updates: ఏపీలో ఎటుచూసినా వరద బీభత్సమే.. జిల్లాలో కొనసాగుతోన్న జలప్రళయం..

AP Weather: ఈశాన్య రుతుపవనాల కారణంగా కురుస్తోన్న వర్షాల కారణంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై తీరానికి సమీపంలో ఉండడంతో.. ఏపీలోని పలు జిల్లాలపై...

AP Rains Updates: ఏపీలో ఎటుచూసినా వరద బీభత్సమే.. జిల్లాలో కొనసాగుతోన్న జలప్రళయం..
Ap Rains

|

Nov 19, 2021 | 9:50 PM

Telangana Rains Updates: ఈశాన్య రుతుపవనాల కారణంగా కురుస్తోన్న వర్షాల కారణంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై తీరానికి సమీపంలో ఉండడంతో.. ఏపీలోని పలు జిల్లాలపై  ప్రభావం చూపించింది. ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దయిన చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాలకు చెందిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లమని సూచించారు. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

ఇక వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా కోస్తా భాగాల్లో పాటు విశాఖపట్టణం, విజయనగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే.. తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తిరుమల వీడులతోపాటు తిరుపతిలోని అనేక ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజుల పాటు శ్రీవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Nov 2021 08:42 PM (IST)

  అనంతపురం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న యువకులు..

  అనంతపురం జిల్లాలోని ధర్మవరం చెరువు నిండిపోవడంతో రెండో మరవ వద్ద ఏడుగురు యువకులు చిక్కుకుపోయారు. వాళ్లు ఎటూ వెళ్లలేని పరిస్థితి. చెరువు నిండుతోందని.. చిన్నూరుకు చెందిన యువకులు చూడ్డానికి వెళ్లారు. ఇంతలో వరద ఒక్కసారిగా పోటెత్తింది. చెరువు అలుగు పోయడం మొదలుపెట్టింది. దీంతో ఏడుగురు యువకులు అవతలే చిక్కుకుపోయారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.

 • 19 Nov 2021 08:00 PM (IST)

  సీఎం జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌..

  సీఎం జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌ చేశారు. వరద పరిస్థితిని ఆరా తీశారు. అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందిస్తామంటూ భరోసా ఇచ్చారు మోదీ.

   

 • 19 Nov 2021 07:59 PM (IST)

  వరద ప్రాంతాల్లో శనివారం సీఎం జగన్‌ పర్యటన..

  కరువు సీమ రాయలసీమలో వరుణుడు సృష్టించిన విలయం ఊహకందని విధంగా ఉంది. జల ఖడ్గానికి జనజీవనం కకావికలమైంది. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మునుపెన్నడూ చూడని విధంగా వర్షాలు కురిశాయి. వరద ప్రాంతాల్లో శనివారం సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని పరిశీలిస్తారు.

 • 19 Nov 2021 07:18 PM (IST)

  తమిళనాడు వెల్లూర్ జిల్లాలో విషాదం..

  వెల్లూర్ జిల్లాలో కూడా విషాదం నెలకొంది. వర్షాల ధాటికి ఓ భవనం కూలిపోయింది. ఈఘటనలో ఏడుగురు మృతి చెందారు. అక్కడ సహాయకచర్యలు చేపడుతున్నారు సహాయక సిబ్బంది.ఈఘటనలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఏడుగురు మృతి చెందారు. ప్రమాదంపై స్టాలిన్ సర్కారు సీరియస్ అయింది. వెల్లూరు ఘటనపై తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం...మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50వేలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు.

 • 19 Nov 2021 06:23 PM (IST)

  పాలారులో వరద ప్రవాహం.. నీటిలో కొట్టుకుపోయిన భవనం..

  ఆంధ్రా నుంచి వస్తున్న వరదనీటి ఉధృతికి పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. పాలారులో వరద ప్రవాహం పెరిగింది. వరద నీటిలో ఓ భవనం కొట్టుకుపోయింది. చాలా గ్రామాలు నీటమునిగాయి. వరద ముంపులో చిక్కుకున్న గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు NDRF సిబ్బంది.

 • 19 Nov 2021 06:22 PM (IST)

  ఆంధ్రాలోనే కాదు...వాయుగుండం ఎఫెక్ట్ తమిళనాడుపై..

  ఆంధ్రాలోనే కాదు...వాయుగుండం ఎఫెక్ట్ తమిళనాడుపైనే తీవ్రంగా చూపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. తమిళనాడులోని వెల్లూర్ , కాంచీపురం , తిరువళ్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

 • 19 Nov 2021 06:15 PM (IST)

  భయపెడుతోన్న పెన్నానది ప్రవాహం..

  నెల్లూరు జిల్లా ప్రజల్ని పెన్నానది ప్రవాహం భయపెడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరదనీరు చేరడంతో నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భంగంలో చిక్కుకున్నాయి. సోమశిల రిజర్వాయర్‌ నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీరు పెన్నాకు చేరడంతో...నది చుట్టూ ఉన్న కాలనీవాసుల్ని అధికారులు ఇళ్లు కాళీ చేయించారు. పెన్నానదిని పక్కనే ఉన్న భగత్‌సింగ్‌ కాలనీ నీటమునిగింది.

 • 19 Nov 2021 05:35 PM (IST)

  శివాలయం వద్ద గల్లంతైన భక్తుల్లో 11మంది పేర్లు ఇవే..

  కడప జిల్లా పులపత్తూరు శివాలయం దగ్గర గల్లంతైన భక్తుల్లో 11మందిని గుర్తించి పేర్లు రిలీజ్ చేశారు అధికారులు. ఈ లిస్ట్‌లో భీము చెంగల్‌రెడ్డి, సింగరాజు వెంకటరాజు, ఎస్‌.శంకరమ్మ, జి.ఆదెమ్మ, బి.పద్మావతమ్మ, బి.భారతి, బి.వెంకట సుబ్బరాజు, పల్లా చెన్నకేశవులు, సంపతి గంగయ్య, సంపతి మల్లయ్య, వి.మహాలక్ష్మి ఉన్నారు.

   

 • 19 Nov 2021 05:34 PM (IST)

  పులపత్తూరులో గల్లంతైన భక్తుల కోసం రంగంలోకి ఎయిర్ ఫోర్స్

  కడప జిల్లా పులపత్తూరు శివాలయంలో పూజలు చేస్తుండగా ఒక్కసారిగా ఉప్పొంగిన చెయ్యేరు నది టెంపుల్‌ను అమాంతం కమ్మేసింది. పూజలు చేస్తున్నవాళ్లు చేస్తున్నట్టుగానే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఊహకందనివిధంగా విరుచుకుపడ్డ చెయ్యేరు వరద 30మందిని తనతో తీసుకుపోయింది. కొట్టుకుపోయినవాళ్లంతా ఏమయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. గల్లంతైన భక్తుల కోసం గాలింపు కొనసాగుతోంది. రంగంలోకి దిగిన ఎయిర్ ఫోర్స్ ..హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు.

   

 • 19 Nov 2021 05:31 PM (IST)

  జలదిగ్బంధంలో పుట్టపర్తి సాయినగర్‌..

  నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వరద ముంచెత్తింది. దీంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లాలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుట్టపర్తిని వరదనీరు ముంచెత్తింది. దీంతో పుట్టపర్తిలోని సాయినగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. హనుమాన్, సత్యమ్మ దేవాలయాలు నీటిలో మునిగిపోయాయి. కాలనీల్లో ఉన్న టూవీలర్లు కూడా నీటిలో మునిగిపోయాయి. చుట్టూ పక్కల వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పుట్టపర్తికి రాకపోకలు నిలిచిపోయాయి.

 • 19 Nov 2021 05:13 PM (IST)

  ప్రమాకరస్థితికి సోమశిల ప్రాజెక్టు

  నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల ప్రాజెక్టు దగ్గర వరద ప్రమాకరస్థితికి చేరింది. దీంతో ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

 • 19 Nov 2021 05:09 PM (IST)

  బస్సులో చిక్కుకున్న వారిని రక్షించిన రెస్క్యూ టీమ్‌

  కడప జిల్లా రామాపురం దగ్గర చెయ్యేరులో నదిలో రెండు బస్సులు చిక్కుకుపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పల్లె వెలుగు బస్సు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. దీంతో బస్సులో ఉన్న కండక్టర్‌తో సహా ముగ్గురు చనిపోయారు. దీంతో వారి మృతదేహాలు కూడా ఇంకా బస్సులోనే ఉన్నాయి. మరోవైపు రామాపురంలో ఆర్టీసీ బస్సులో చిక్కుకున్న వారిని రక్షించారు రెస్క్యూ టీమ్‌. బస్సులో నుంచి ప్రయాణికులను బయటకి తీసుకొచ్చారు.

 • 19 Nov 2021 04:06 PM (IST)

  కడప జిల్లా పులపత్తూరులో కొట్టుకుపోయిన 30 మంది

  కడప జిల్లా పులపత్తూరులో ఒక్కసారిగా ముంచెత్తిన వరద ప్రవాహంలో 30మంది గల్లంతయ్యారు. శివాలయంలో  30మంది పూజలు చేస్తున్నారు.  పూజలు చేస్తున్నవాళ్లు చేస్తున్నట్టే వరదలో కొట్టుకుపోయారు. ఊహకందనివిధంగా విరుచుకుపడ్డ వరద ప్రవాహం మొత్తం 30మందిని తనతో తీసుకుపోయింది.

 • 19 Nov 2021 04:04 PM (IST)

  రాయలసీమలో వరుణుడి బీభత్సం

  రాయలసీమలో వరుణుడు సృష్టించిన బీభత్సం ఊహకందని విధంగా ఉంది. కళ్లు మూసి తెరిచేలోపే అంతా మటాష్. తెరుకునేలోపే అంతా తుడిచిపెట్టుకునిపోయింది. ఊహించనివిధంగా విరుచుకుపడిన వరద ప్రవాహానికి ప్రజలు కొట్టుకుపోయారు.

 • 19 Nov 2021 03:33 PM (IST)

  వరద బాధితులను ఆదుకోండి.. అభిమానులకు చిరంజీవి పిలుపు..

  తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతుండడం చూస్తుంటే మనసును కలిచివేస్తున్నాయన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తిరుపతి, తిరుమల పరిస్థితులపై పోస్ట్ చేశారు. "గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కోంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత నివ్వాల్సిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరు.

 • 19 Nov 2021 03:26 PM (IST)

  చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి..

  చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 543 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, 700 విలేజెస్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. 1221 గ్రామాలకు విద్యుత్ సరఫరా బంద్ అయ్యింది. జిల్లావ్యాప్తంగా 160 చెరువులకు గండి పడింది. 70 చోట్ల రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుమారు 220 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఐదుగురు మరణించారు.

 • 19 Nov 2021 03:25 PM (IST)

  చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న జలప్రళయం..

  చిత్తూరు జిల్లాలో జలప్రళయం కొనసాగుతోంది. కనుచూపుమేర ఎటుచూసినా వరద బీభత్సమే కనిపిస్తోంది. వరుణుడి మహోగ్రరూపానికి తిరుపతి, తిరుమల పట్టణాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.

 • 19 Nov 2021 02:02 PM (IST)

  ఘాట్‌ రోడ్డులను పునరుద్ధరించిన టీటీడీ..

  భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న తిరుమల ఘాట్‌ రోడ్డును అధికారులు పునరుద్ధరించారు. ఘూట్‌ రోడ్లపై విరిగిపడిన కొండచరియలను యుద్ధప్రాతిపదికన టీటీడీ అధికారులు తొలగించారు. రెండు ఘాట్‌ రోడ్లలో భక్తులను అనుమతించాలని నిర్ణయించారు.

 • 19 Nov 2021 01:03 PM (IST)

  క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు..

  రాజంపేట మండలం రామాపురం రోడ్డుపై రెండు బస్సులు నీటిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరిని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చారు.

   

 • 19 Nov 2021 12:16 PM (IST)

  అత్యవసరమైతేనే బయటికి రండి..

  తుఫాను ప్రభావంతో అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ముందని, కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. NDRF బృందాలు, పోలీసులు, ఫైర్,మున్సిపల్ విభాగాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా కోరాలని సూచించారు.

 • 19 Nov 2021 11:56 AM (IST)

  వర్షాల కారణంగా మృతి చెందిన వారికి రూ. 5 లక్షల పరిహారం..

  ఏపీలో భారీగా కురుస్తోన్న వర్షాలపై సీఎం జగన్‌ అత్యవసర సమీక్షను నిర్వహించారు. ఇందులో భాగంగా వర్షాలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ అధికారులతో మాట్లాడుతూ.. 'ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి. మళ్లీ పంటవేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలి. జిల్లాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని' సీఎం జగన్‌ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు.

  Cm Jagan

 • 19 Nov 2021 11:45 AM (IST)

  వరద నీటిలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు..

  భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్లను ముంచెత్తుతోంది. రాజంపేట మండలం రామాపురం రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రెండు బస్సులు నీటిలో చిక్కుకుపోయాయి. వీటిలో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండడంతో ప్రయాణికులు బస్‌లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

 • 19 Nov 2021 11:31 AM (IST)

  భారీ వర్షాలపై స్పందించిన వెంకయ్య నాయుడు..

  తిరుపతి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. 'తిరుపతి నగరం జలమయమై, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ఎంతో విచారించాను. ఈ నేపథ్యంలో అధికారులు చేపడుతున్న సహాయ చర్యలు అభినందనీయం. వీటిని మరింత ముమ్మరం చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని' అధికారులకు సూచించారు.

 • 19 Nov 2021 11:08 AM (IST)

  భారీ వరదలతో భయానక దృశ్యాలు..

  ఏపీలో కురుస్తోన్న వర్షాల కారణంగా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరద నీటిలో మూగ జీవులు కొట్టుకుపోతున్నాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి.

  Rains

 • 19 Nov 2021 11:02 AM (IST)

  దర్శనానికి వచ్చిన వారికి సహాయం..

  తిరుమల, తిరుపతిలో భారీగా కురుస్తోన్న వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దర్శనానికి వచ్చిన వారందరికీ సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీ అధికారుల సమన్వయంతో యాత్రికులకు సహాయంగా నిలవాలని తెలిపారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో అన్ని రకాలుగా తోడుగా ఉండాలని తెలిపారు. ప్రమాదకర పరిస్థితులున్న నేపథ్యంలో భక్తులను కొండపైనే ఉంచాలని ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల పాటు తగిన వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

 • 19 Nov 2021 10:58 AM (IST)

  తిరుపతిలో పరిస్థితి ఎలా ఉందో చూడండి..

 • 19 Nov 2021 10:51 AM (IST)

  నదిలో కొట్టుకుపోయిన 40 మంది..

  కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం కట్ట కొట్టుకుపోవడంతో పరివాహక ప్రాంతాల్లో వరద భారీగా పెరిగింది. దీంతో గుండ్లూరు, శేషమాంబపూరం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేటకు వరద నీరు పెరిగింది. నందలూరు పరివాహక ప్రాంతంలోని చెయ్యేరు వరద ఉధృతిలో 40 మంది కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

 • 19 Nov 2021 10:13 AM (IST)

  కడప జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు..

  భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లా వేంపల్లిలో గండి పడింది. రాజంపేట కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో దిగువ నున్న చెయ్యేరు నదిలోకి వర్షపు నీటిని వదులుతున్నారు అధికారులు. చెయ్యేరు నది పరివాహక ప్రాంతాలను తాకుతోంది వరద నీరు. రామాపురం దగ్గర ఏర్పాటు చేసిన అటవీశాఖ చెక్ పోస్ట్ ను ముంచేసింది వరదనీరు. దీంతో నందలూరు నుంచి తిరుపతి కి రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లా వేముల మండలంలోని చాగలేరు దగ్గర వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో చాగలేరు, కొత్త పల్లి, రంగోలి పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 60 ఏళ్ల తర్వాత వేముల మండలంలోని బచ్చ య్యగారిపల్లి దగ్గర గల నాయునిచెరువు నిండిపోయింది. భారీ వర్షాలతో జిల్లాలో పాపాగ్ని నది ఉధృత రూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కడప జిల్లాలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. కడప జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పులివెందుల జలదిగ్భంధంలో చిక్కుకుంది.

 • 19 Nov 2021 10:00 AM (IST)

  తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం..

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం తెలంగాణపై ఉండనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఏపీ- ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న అల్పపీడనం నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడి వాయుగుండంగా మారిందని తెలిపింది. దీంతో ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

 • 19 Nov 2021 09:53 AM (IST)

  మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు..

  ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం మూడు జిల్లాల్లో వరద సహాయక పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించనున్నారు. ఈ క్రమంలో నెల్లూరుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్‌ ప్రద్యుమ్న, కడప జిల్లాకు సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌ను నియమించారు.

 • 19 Nov 2021 09:48 AM (IST)

  నెల్లూరులో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..

  భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెన్ననది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. వెంగమ నాయుడుపల్లి, బండారుపల్లి,వీర్లగుడిపాడు, నడిగడ్డ అగ్రహారంలను చుట్టుముట్టింది పెన్నా వరద ప్రవాహం. పెన్నా ఉప నదులు కొమ్మ లేరు, కేతా మన్నేరు, బొగ్గేరు, బీరాపేరు, నల్లవాగు కూడా ఉప్పొంగుతున్నాయి. సోమశిల జలాశయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ నదుల నుంచి మరో రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు పెన్నా నదిలో కలుస్తున్నాయి. దీంతో పెన్నా నది లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు ఆనకట్ట దగ్గర దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. దీంతో నెల్లూరువాసుల్లో భయాందోళన నెలకొంది.

 • 19 Nov 2021 09:29 AM (IST)

  రాకపోకలను పునరుద్ధరించిన టీటీడీ..

  అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు తొలగించారు. భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోంది. భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపుతూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ కోరింది.

 • 19 Nov 2021 08:47 AM (IST)

  వర్షాల కారణంగా దర్శనాల నిలిపివేత..

  తిరుమలలో భారీగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నిత్య కైంకర్యాలు మినహా.. భక్తుల దర్శనాలు నిలిపేశారు. ఘాట్‌ రోడ్డులో 13 పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్‌రోడ్డులో పలుచోట్ల సిబ్బంది కొండచరియలు తొలగిస్తున్నారు. ప్రస్తుతం తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో రాకపోకలు కొనసాగిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్‌రోడ్డులో కొండ చరియలను తొలగించి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు టిటిడి సిబ్బంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మాల్వాడి గుండం వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుమల అదనపు ఈవో క్యాంపు ఆఫీసులోకి వరదనీరు చేరింది. నారాయణగిరి అతిథి గృహంలో కొండచరియలు విరిగిపడి మూడు గదులు ధ్వంసం అయ్యాయి. ఏపీ టూరిజం రెస్టారెంట్‌ గోడ కూలిపోయింది. నారాయణస్వామి అనే వ్యక్తి శిథిలాల కింద ఇరుక్కుపోవడంతో రెస్క్యూ టీమ్‌ అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అటు అలిపిరితోపాటు కాలినడకమార్గం మూసి వేశారు టిటిడి అధికారులు. తిరుమలలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలకు కొంత అంతరాయం కలిగింది

 • 19 Nov 2021 08:38 AM (IST)

  వరద నీటిలో ఎంజాయ్‌ చేస్తున్న యువకులు..

  ఓవైపు భారీ వర్షాలకు కాలనీలన్నీ జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు యువకులు మాత్రం వరద నీటిలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్‌లో చేరిన భారీ వరద నీటిలో వాలీబాల్‌ ఆడుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 • 19 Nov 2021 08:26 AM (IST)

  జల దిగ్బంధంలో తిరుపతి నగరంలో..

  తిరులమ గిరుల్లో కురిసిన భారీ వర్షాలు తిరుమలను ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు కొండపై నుంచి వస్తుండడంతో తిరుపతిలో 67 కాలనీలు జలమయమయ్యాయి. నగరంలోని సత్యనారాయణపురం, జీవకోన, వెస్ట్‌ చర్చి, అబ్బన్న కాలనీ, కొర్లగుంట, లక్ష్మీపురం సర్కిల్‌, మధురానగర్‌నగర్‌లో భారీగా వరద నీరు చేరింది. దీంతో వరద బాధితుల కోసం తిరుపతిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 • 19 Nov 2021 08:18 AM (IST)

  వాయుగుండం ప్రభావంతో దంచి కొడుతోన్న వర్షాలు..

  బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో తీరం వెంబడి 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

 • 19 Nov 2021 08:05 AM (IST)

  శ్రీవారి దర్శనంపై వర్షం ఎఫెక్ట్‌..

  తిరుమల, తిరుపతిలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనంపై తీవ్ర ప్రభావం పడింది. భారీగా వరద నీరు వస్తుండడంతో అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు పాపవినాశం రహదారిని టీటీడీ మూసేశారు. భారీ వర్షాల కారణంగా అన్ని నడకదారులు మూసివేశారు. ఇక భక్తులకు టీటీడీ మరో అవకాశాన్ని కలిపించింది. శుక్రావారం, శనివారం దర్శనం టికెట్లు కలిగి ఉండి.. తిరుల రాలేని భక్తులకు తర్వాతి రోజుల్లో అనుమతి ఇస్తూ అవకాశం కలిపించారు. ఇక తిరుపతిలో భారీగా కురుస్తోన్న వర్షాల కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో.. విమానాల ల్యాండింగ్ నిలిపివేశారు. విమానాల మార్గాలను మళ్లించారు.

 • 19 Nov 2021 08:00 AM (IST)

  కడపలో భారీ వర్షం..

  ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా కడప నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు నగరంలో 11 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. బుగ్గవంక నుంచి నీరు విడుదల చేశారు.

 • 19 Nov 2021 07:55 AM (IST)

  జిల్లాల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు..

  భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సహాయక చర్యల కోసం జిల్లాల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఎవరైన అవసరం ఉన్న వారు కింది నెంబర్లకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు..
  తిరుపతి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 8309317739
  శ్రీకాళహస్తి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9885545730
  ప్రకాశం జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08592-281400
  కడప కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08562-245259
  రాజంపేట హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9381681866
  జమ్మలమడుగు హెల్ప్‌లైన్ నెంబర్‌ 9676608282

 • 19 Nov 2021 07:48 AM (IST)

  తీరం దాటిన వాయుగుండం..

  నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య పుదుచ్చేరి,చెన్నై మధ్య తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. .చిత్తూరు జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సీమతో పాటు అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.

Published On - Nov 19,2021 7:47 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu