
అమరావతి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. అయినప్పటికీ, ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఎన్నికలే టార్గెట్‌గా ఇటు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన జనంలోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తగ్గేదేలే అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే బ్రో మూవీ ఏపీలో సరికొత్త వివాదానికి దారితీసింది. సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ అచ్చం మంత్రి అంబటి రాంబాబు ను పోలి ఉండటంతో ఈ రచ్చ మొదలైంది. అయితే, గల్లీలో మొదలైన బ్రో సినిమా వ్యవహారం ఢిల్లీకి చేరుతోంది. థియేటర్‌లో పవన్ పేల్చిన పంచ్‌లు.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి. శ్యాంబాబు క్యారెక్టర్‌తో మొదలైన రాజకీయ రచ్చ.. వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లింది. ఆ తర్వాత ఇంకొంచెం ముదిరి.. మనీ లాండరింగ్ మ్యాటర్ స్క్రీన్‌పైకి వచ్చింది. నిన్న అంబటి చేసిన కామెంట్స్, తాజాగా జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలు మరింత కాకరేపాయి. ఈ దుమారంలో వైసీపీ నేతలు కూడా ఎంటరయ్యారు. అంబటి రాంబాబు చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు బలపరుస్తున్నారు. దీనిపై న్యాయవిచారణ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదిలాఉంటే.. పవన్‌పై అంబటి చేసిన ఆరోపణలపై జనసేన నేతలు భగ్గుమంటున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, సినిమాలపై మోజు పెడుతున్నారంటూ జనసేన నేత పోతిన మహేష్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే సినిమా టైటిళ్లు కూడా తెరపైకి వచ్చాయి.
మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. పవన్‌పై మ్రో సినిమా తీస్తామని ప్రకటించారు. దాంతోపాటు పవన్‌పై మరో 7 సినిమాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. దానికి సంబంధించి M.R.O – మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్ ఇలా మరికొన్ని టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. అయితే, దీనికి కౌంటర్ ఎటాక్ చేశారు జనసేన నేత పోతిన మహేష్. M.R.Oకి పోటీగా S.S.S – సందులో సంబరాల శ్యాంబాబు సినిమా తీస్తామని జనసేన ప్రకటించింది. అంతేకాదు.. మంత్రి అంబటి, ఇతర వైసీపీ నేతలపై 7 సినిమాలు తమ పరిశీలనలో ఉన్నాయని పోతిన మహేష్ ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన SSS సినిమా విషయంలో మరో ముందడుగు వేసి షూటింగ్ కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా తిరుపతిలో జనసేన కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై, మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసిస్తూ.. సందులో సంబరాల శ్యాంబాబు పేరుతో క్లాప్ కొట్టి షూటింగ్ చేస్తూ సందడి చేశారు. మంత్రి అంబటి మాస్క్ వేసిన వ్యక్తి చేత డ్యాన్స్ చేయించి పవన్‌కు జై కొట్టిస్తూ జనసేన కార్యకర్తలు షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఇదిలాఉంటే.. అంబటి రాంబాబు పవన్ పై తీసే సినిమా కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని వైసీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.. దీంతో ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు MRO – SSS చర్చనీయాంశంగా మారాయి.
బ్రో సినిమా వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు మంత్రి అంబటి రాంబాబు సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. అంబటి బ్రో సినిమా లావాదేవీలపై రేపు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. బ్రో సినిమాకు అక్రమంగా ఫండింగ్ జరిగిందని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. పవన్ రెమ్యునరేషన్‌ను చంద్రబాబు నుంచి వచ్చిన ప్యాకేజీ అని ఆరోపిస్తున్నారు. మొత్తానికి మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని, ఇటు పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..