
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కేంద్రం దయతో ఇస్తున్నట్లు అమిత్ షా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల పన్నుల నుంచే పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఢిల్లీ పెద్దలు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్‌పై రాష్ట్రానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. పోలవరం విషయంలోను కేంద్రం సహాయం చేయడం లేదని ఆరోపించారు.
వైసీపీకి ఏ పార్టీపై ఆధారపడే పరిస్థితి లేదని.. తమకు ఏ పార్టీతో కూడా పొత్తులు లేవని స్పష్టం చేశారు. ఇంతవరకు విభజన హామీలు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. టీడీపీ హయంలో ఉన్న ఇసుక అక్రమాలపై కేంద్ర హోం మంత్రి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒకప్పుడు అమిత్ షా పై రాళ్లు వేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు పూవ్వులు వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క సీటు కూడా లేని బీజేపీ 20 లోక్ సభ సీట్లు ఎలా ఆశిస్తుందంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.