AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళే షెడ్యూల్‌..! మహిళలకు 50 శాతం సీట్లు.. ఏపీ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల లెక్కలివే!

లోకల్ వార్‌కు అంతా సిద్ధమైంది. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఉదయం 11.30కి SEC ప్రెస్ మీట్ ఉంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించబోతున్నారు?.

ఇవాళే షెడ్యూల్‌..! మహిళలకు 50 శాతం సీట్లు.. ఏపీ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల లెక్కలివే!
Andhra Pradesh Local Body Elections
Shaik Madar Saheb
|

Updated on: Oct 14, 2026 | 7:09 AM

Share

ఏపీలో లోకల్ వార్‌ టెన్షన్‌కు తెరపడబోతోంది. ఇవాళే షెడ్యూల్ రాబోతోంది. ముందుగా మున్సిపల్, ఆ తర్వాత MPTC, ZPTC, చివరగా పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. ఇవాళ 11.30కి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. ఈ ప్రెస్‌మీట్‌లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. షెడ్యూల్ ప్రకటించగానే ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అన్నిచోట్లా 50శాతం మహిళలకు సీట్లు కేటాయించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ జరిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికలు, సన్నద్ధతపై చర్చించారు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ. 20 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా.. 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యాయి. కుల ధృవీకరణ పత్రాలు, నేటివిటీ సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే మద్యాన్ని కంట్రోల్ చేయడంతో పాటు, ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని SECని కోరారు. దసరా ఉత్సవాలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్. పార్టీల సూచనలపై జిల్లాలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

పంచాయతీలు, MPTC, ZPTCల రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. నిన్న 28 జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అనంతపురం, కర్నూలు, విశాఖ ZP స్థానాలు బీసీకి, NTR, ప్రకాశం-ఎస్సీ రిజర్వ్ చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి బీసీ మహిళగా.. కడప, పశ్చిమగోదావరి సత్యసాయి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, అన్నమయ్య జనరల్‌ స్థానాలుగా నిర్ణయించారు. తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, కృష్ణా, బాపట్ల, కాకినాడ, చిత్తూరు జిల్లా జెడ్పీ స్థానాలు జనరల్‌ మహిళకు కేటాయించారు. కోనసీమ, తిరుపతి, గుంటూరు ఎస్సీ మహిళగా నిర్ణయించారు. పార్వతీపురం, అల్లూరి జిల్లా జెడ్పీ స్థానాలు ఎస్టీకి, పోలవరం-ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17కార్పొరేషన్లలో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు మేయర్‌ స్థానాలు కేటాయించింది ప్రభుత్వం. జనరల్‌ మహిళలకు ఐదు స్థానాలు రిజర్వ్‌ చేసింది. నాలుగు స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీగా ప్రకటించింది. 106 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు మూడు స్థానాలు కేటాయించారు. అందులో ఒకటి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. ఎస్సీలకు మొత్తం 14 కేటాయించగా వాటిలో మహిళలకు ఏడు, జనరల్‌కు ఏడు కేటాయించారు. బీసీలకు 36 స్థానాలు దక్కాయి. వీటిలో మహిళలకు 18, జనరల్‌కు 18 ఉన్నాయి. జనరల్‌ మహిళలకు 27 స్థానాలు రిజర్వ్ చేయగా.. జనరల్ కేటగిరీలో మరో 26 చైర్‌పర్సన్ స్థానాలు ఉన్నాయి.

ఇక గ్రేటర్ విశాఖలోనూ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 120 వార్డులకు జిల్లా కలెక్టర్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. 120 వార్డుల్లో 60 సీట్లు మహిళలకు కేటాయించారు. బీసీలకు 49 వార్డులు.. బీసీ జనరల్ 25, బీసీ ఉమెన్ 24, జనరల్ ఉమెన్ 31, ఎస్సీ ఉమెన్ 5, ఎస్సీ జనరల్ 5, ఎస్టీ జనరల్‌కు 1 వార్డు రిజర్వ్ చేశారు. అన్ రిజర్డ్ స్థానాలుగా 29 ప్రకటించారు.

Follow Us