AP News: వారికి ఏపీ హోంమంత్రి మాస్ వార్నింగ్.. మరో ప్రాణం కూడా పోకూడదంటూ..

| Edited By: Ravi Kiran

Aug 24, 2024 | 7:35 PM

'పదేపదే ప్రమాదాలతో కంపెనీలని మూసివేసే పరిస్థితులు తీసుకురావద్దు.. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారు మీ ఇష్టం.. చేతులు జోడించి చెబుతున్న మరో ప్రాణం ప్రమాదాల వల్ల పోకూడదు.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు ఉంటాయ్.' అని అన్నారు హోం మంత్రి అనిత.

AP News: వారికి ఏపీ హోంమంత్రి మాస్ వార్నింగ్.. మరో ప్రాణం కూడా పోకూడదంటూ..
Home Minister Anita
Follow us on

‘పదేపదే ప్రమాదాలతో కంపెనీలని మూసివేసే పరిస్థితులు తీసుకురావద్దు.. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారు మీ ఇష్టం.. చేతులు జోడించి చెబుతున్న మరో ప్రాణం ప్రమాదాల వల్ల పోకూడదు.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు ఉంటాయ్.’ అని అన్నారు హోం మంత్రి అనిత. పరిశ్రమల భద్రతపై అనకాపల్లిలో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రతకు జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

అనకాపల్లి జిల్లా ఎసెన్షియ ప్రమాదంతో ప్రభుత్వం పరిశ్రమల్లో భద్రతపై సీరియస్గా దృష్టి సారించింది. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో పరిశ్రమల భద్రతపై పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్తల సంఘాల సభ్యులు, జిల్లా అధికారులతో పరిశ్రమలలో ఉద్యోగుల భద్రత, పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదలపై తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో మరణించిన 17 మంది ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సేఫ్టీ కిట్స్ లేని పరిశ్రమలు కూడా ఉన్నాయి..!

ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటన జరిగిన తదుపరి ఇలాంటి సమావేశం నిర్వహించుకోవడం బాధాకరమన్నారు అనిత. సంఘటన జరిగిన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఎంత శ్రమించారనేది తెలిపారు. బల్క్ డ్రగ్స్ పరిశ్రమలలో రియాక్టర్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి పారిశ్రామికవేత్త వారి కంపెనీకి సంబంధించి పూర్తి సేఫ్టీ పద్ధతులు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సేఫ్టీ కిట్స్ కూడా లేని పరిశ్రమలు ఉన్నాయని, అధికారులు తనిఖీలు నిర్వహించి అటువంటి కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదే చివరి ప్రమాదం కావాలి.. ఏ ఒక్కరి ప్రాణాలు పోకూడదు..

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన అనంతరం విధులు లోకి తీసుకోవాలన్నారు. చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలుగా మారే పరిస్థితి వస్తుందని, ప్రతి పారిశ్రామికవేత్త ఎస్ఓపి పాటించాలన్నారు. తాజాగా జరిగిన ఘటన చివరిదిగా ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పారిశ్రామికవేత్తలు సేఫ్టీ పద్ధతులను పాటించాలన్నారు. ఏ ఒక్కరూ ప్రాణం నష్టపోకూడదని అందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని మంత్రి కోరారు.

జిల్లాస్థాయిలో సేఫ్టీ కమిటీలు..

ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులు స్పందించడం జరిగిందని, సంఘటన జరిగిన 24 గంటలలోపే ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున చెక్కులను ఎక్స్ గ్రేషియా గా అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తీవ్ర గాయాలైన 20 మందికి ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున, స్వల్ప గాయాలైన 18 మందికి ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. వైద్యం పొందుతున్న ఉద్యోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాస్థాయి సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి రెడ్, ఆరెంజ్ జోన్ లో ఉండే కంపెనీలను ఈ కమిటీ పరిధిలోకి తీసుకు వస్తామన్నారు. ప్రతి కంపెనీలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్న సమయంలో అలారం ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ, అవసరమైన ఉద్యోగులకు సేఫ్టీకిట్స్ అందుబాటులో ఉంచాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి సమీక్ష నిర్వహించి, మంత్రులకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

పరిశ్రమలు రావాలి కానీ..

ఇండస్ట్రీస్ రావాలి,అదే సమయంలో సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలిలన్నారి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఎవరైనాసరే ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో అయితే ఇటువంటి సంఘటనలు జరగవు అన్నారు. ఇండస్ట్రీస్ మేనేజ్ మెంట్ లు కూడా లేటెస్ట్ టెక్నాలజీలను వినియోగించుకోవాలన్నారు. ఆలోచన విధానంలో మార్పులు రావాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం పట్ల అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖలో ఉన్నవారికి సరైన స్థాయిలో ట్రైనింగ్ అవసరమన్నారు ఎంపీ.

జీరో జోన్‌కు పారిశ్రామికవేత్తలు సహకరించాలి..

అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలు హాజరై.. అభిప్రాయాలను, సూచనలను, పారిశ్రామికవేత్తలకు, అధికారులకు తెలపారు. ఈ సందర్భంగా ప్రమాదాలలో ‌‌”జీరోజోన్” గా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపిక పాటిల్ , జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, పరిశ్రమల శాఖ, బ్రాయిలరర్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీఐఐసీ అధికారులు, వివిధ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్త సంఘ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.