బ్రహ్మంగారి మఠం కేసులో తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. మఠాధిపతి విషయంలో తనతో బలవంతంగా అంగీకరింపచేశారంటూ వీరబ్రహ్మేంద్రస్వామి రెండో భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ జోక్యం సహా మహాలక్ష్మమ్మ వాదనపై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు రాబోతుంది. అయితే కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతుందన్నది ఉత్కంఠగా మారింది. బ్రహ్మంగారి మఠాధిపతి వివాదం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది.
ఇద్దరు భార్యల కుమారులు, తానంటే తాను వారసున్ని అంటూ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో శాశ్వత, తాత్కాలిక మఠాధిపతిగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలని కోరుతూ మహాలక్ష్మమ్మ హైకోర్టు తలుపుతట్టారు.
మఠాధిపతి ఎంపికపై దేవాదాయశాఖ జోక్యం చేసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మఠానికి ప్రత్యేక అధికారి నియామకంపై గత వారం ప్రశ్నించిన హైకోర్టు ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారో చెప్పాలని దేవాదాయశాఖను ఆదేశించింది.
అంతకు ముందు అనేక తర్జన భర్జనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రెండు కుటుంబాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. అనంతరం.. దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామికే పీఠం దక్కే విధంగా కుటుంబసభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చారు.
మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి బాధ్యతలు తీసుకుంటారని ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ప్రకటించారు. దీంతో దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.