
బెజవాడ, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో మొదటి సారి జంతువుల కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిని బుధవారం విచారించిన హై కోర్టు బెజవాడ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. CRPC ఫాలో అవ్వకుండా గోవులను ఎలా విడుదల చేస్తారని హై కోర్టు పోలీసులపై మండి పడింది. గోవులు ఎక్కడ ఉన్నాయి వాటి ఆరోగ్య స్థితి, పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని భవానిపురం పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ రోజు ఈ కేసుపై హై కోర్టు మరోసారి విచారణ జరపనుంది.
అక్రమంగా తరలిస్తున్న 195 గోవులను అడ్డుకొని విజయవాడ భవానిపురం పోలీసులకు జంతు ప్రేమికులు జూన్ 16 తేదిన అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే భవానిపురం పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. అక్రమంగా గోవులు తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయకుండా గోవులను వదిలేశారు. దీంతో తాము అప్పగించిన గోవులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలని డిమాండ్ చేస్తూ హై కోర్టులో జంతు ప్రేమికులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం పిటిషన్‌ను విచారించిన జస్టిస్ దుర్గా ప్రసాద్, జస్టిస్ సుమతి జగడంలతో కూడిన డివిజన్ బెంచ్ నేడు మరో మారు విచారించనుంది.
బక్రీద్‌కు ముందు రోజు విజయవాడలో అక్రమంగా పశువులను వాహనాల్లో రవాణా చేస్తున్నారనే సమాచారం అందడంతో పిటషనర్లు వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా పదేళ్ల కంటే తక్కువ వయసున్న, తక్కువ బరువున్న గోవులు అందులో కనిపించాయి. వాటిల్లో కొన్నింటికి చర్మ వ్యాధులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 10 ఏళ్లలోపు జంతువులు, వ్యాధులు ఉన్న జంతువులను మాంసం కోసం వినియోగించకూడదు. దీంతో వెంటనే పిటిషనర్లు భవానిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, పశువులను రవాణా చేయకుండా అడ్డుకున్నారు. అనంతరం కాసేపటికి పోలీసులు మళ్లీ పిటిషనర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారు అక్కడికి చేరుకోగానే పీఎస్ వెలుపల సుమారు 300 మంది గుంపు గుమిగూడి ఉన్నారు. వారంతా స్వాధీనం చేసుకున్న పశువుల యజమానులమని, వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే వారి వాదనలు పిటిషనర్లు ఆమోదించలేదు. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, వాస్తవాలను ధృవీకరించేందుకు చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించకుండా పిటిషనర్లను రిమాండ్ చేసి, జంతువులను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో పిటిషనర్లు చట్టవిరుద్ధం, ఏకపక్ష నిర్ణయం, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం 1960, AP గోహత్య నిషేధం – జంతు సంరక్షణ చట్టం 1977.. పలు నేరాల కింద హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.