Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు.. రిగ్గింగ్ పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు..

|

Oct 19, 2022 | 10:56 AM

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌, ఫోర్జరీ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి షాకిచ్చింది ఏపీ హైకోర్ట్‌. ఎమ్మెల్యేగా...

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు.. రిగ్గింగ్ పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు..
Vallabhaneni Vamsi
Follow us on

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌, ఫోర్జరీ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి షాకిచ్చింది ఏపీ హైకోర్ట్‌. ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఎన్నిక చెల్లదంటూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్‌ వేసిన పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది. బాపులపాడులో ఎమ్మార్వో స్టాంపును ఫోర్జరీ చేసి 12 వేల నకిలీ ఇళ్ల పట్టాలను వల్లభనేని వంశీ, అతని అనుచరులు పంచారని రెండేళ్ల క్రితం యార్లగడ్డ వెంకట్రావ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రసాదం పాడు పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారంటూ మరో పిటిషన్‌ వేశారు. విచారణ ఆలస్యం కావడంతో పిటిషన్‌ వల్ల ఫలితం లేకుండా పోతోందని తన ఆవేదనను చెప్పుకున్నాడు పిటిషనర్‌.

రెండేళ్లక్రితం దాఖలైన ఈ పిటిషన్లపై ఇప్పటివరకు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నత న్యాయస్థానం స్పందించింది. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌, అప్పటి గన్నవరం రిటర్నింగ్‌ ఆఫీసర్‌కి నోటీసులు ఇష్యూ చేసింది. తదుపరి విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది.

2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ పోటీ చేయగా, వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావ్‌ బరిలోకి దిగి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వంశీ వైసీపీకి దగ్గరవడంతో, అప్పట్నుంచి ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, వంశీ ఎన్నికను రద్దు చేయాలని యార్లగడ్డ కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఆ కేసు తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..