
ఏపీలో హజ్‌యాత్రికుల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించిన ట్రావెల్ ధరల్లో తెలంగాణాకీ, ఏపీకీ తీవ్రమైన అంతరం ఉందంటూ మండిపడుతున్నారు హజ్ యాత్రికులు. ఈక్రమంలో హజ్ యాత్రికుల వద్దనుంచి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారంటూ ఏపీకి చెందిన హజ్‌యాత్రికులు ఆందోళన వ్యక్తం చేశారు. హజ్ యాత్రికుల కోసం విజయవాడలో ఈ ఏడాది కొత్తగా ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణతో పోల్చుకుంటే.. ఏపీ హజ్ యాత్రికుల దగ్గర్నుంచి 83 వేల రూపాయలు అదనంగా ట్రావెల్ ఫీజు వసూలు చేస్తుండడం హజ్ యాత్రికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నుంచి గత ఏడాది వరకు హైదరాబాద్ నుంచే హజ్ యాత్రికులు తరలివెళ్లేవారు. నిన్న రాత్రి కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించిన ట్రావెల్ ధరలు తమను తీవ్ర నిరాశకు గురిచేశాయంటున్నారు హజ్‌యాత్రికులు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులు విమాన ఛార్జీల కింద 53 వేల 373 రూపాయలు చెల్లిస్తుంటే.. విజయవాడ నుంచి వెళ్లే యాత్రికులు ఒక లక్షా 36 వేల 780 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.
ప్రస్తుతం విజయవాడనుంచి వెళ్ళే యాత్రికులు హైదరాబాద్ నుంచి వెళ్ళే యాత్రికుల కంటే అదనంగా 83 వేల 407 రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఏపీ నుంచి వెళ్ళే 2వేల మంది యాత్రికుల నుంచి అదనంగా 16 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారంటూ మండిపడుతున్నారు. కొత్తగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ సెంటర్ వల్ల యాత్రికులకు ప్రయోజనం కలగాల్సింది పోయి ఆర్ధికంగా భారంమోపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము ఏపీ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళేందుకు వీలు కల్పించాలని కోరుతున్నారు..లేదా అదనంగా వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..