ఏపీలోని వారందరికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగా ఒక్కో ఫ్యామిలీకి 50 కేజీల బియ్యం!
ఏపీలోని మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

అమరావతి, సెప్టెంబర్ 26:- రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులు, రిజర్వాయర్లలో పెరిగిన ప్రవాహాలు, ముంపు పరిస్థితులపై శనివారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు ముంపునకు గురైన పరిస్థితి, తీసుకుంటున్న సహాయక, పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. దీంతో గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయాన్ని అందించేందుకు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రకాశం బ్యారేజ్‌కు స్థానికంగా వచ్చే వరద నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే పులిచింతల-ప్రకాశం బ్యారేజీ మధ్యన ఓ కొత్త బ్యారేజీ నిర్మాణం అవసరం ఉందని.. ప్రకాశం బ్యారేజీ దిగువన కూడా ఇంకో బ్యారేజీ నిర్మించాల్సిన అవసరాన్ని గతంలోనే ఆలోచన చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
ఈ రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో రూపొందించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. హిర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో తక్షణమే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
అలాగే వివిధ జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం సమీక్షించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, అయితే ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగించాలని సీఎం ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
