AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి తుఫాన్ ముప్పు..! భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో అక్టోబర్ 23 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వ్యవస్థ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడవచ్చని సూచించింది. ఆ తర్వాత వాయుగుండంగా మారి.. తీరం దాటుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీకి తుఫాన్ ముప్పు..! భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2026 | 1:20 PM

Share

ఇప్పటికే తమిళనాడు వానలతో జనజీవనం అతలాకుతలమైంది.. మరోవైపు ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న IMD సమాచారం ప్రకారం.. బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.. ఆ తర్వాత ఇది 28న తీరం దాటనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే.. తమిళనాడులో ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. కన్యాకుమారిలో కొండచరియలు విరిగిపడ్డాయి.. దీంతో రైలు ఇంజిన్‌ బోల్తా పడింది. పలువురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. కేరళం-కన్యాకుమారి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తిరునల్వేలి, కన్యాకుమారిలో జలపాతాలు మూసివేశారు. కాగా.. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 26 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఏపీకి భారీ వర్షసూచన

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంత ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా వరకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఇది శుక్రవారం ఉదయానికి ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతానికి చేరుకోనుంది. ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఆపై అది వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది.

ఈ తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాకినాడ, విశాఖ జిల్లాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం నుంచి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే వెళ్లిన వారుంటే.. వెంటనే ఇళ్లకు చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో సైతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Follow Us