AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమారుడి ప్రేమ వ్యవహారం.. మాట్లాడుకుందామని తండ్రిని పొలాల్లోకి తీసుకెళ్లి..

పల్నాడు జిల్లాలో కుమారుడి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం విషాదాంతమైంది. మాట్లాడుకుందామని రామకృష్ణారెడ్డి (51), ఆయన పెద్ద కుమారుడిని గోగులపాడు శివారులోని పొలాలకు తీసుకెళ్లారు.. అక్కడ జరిగిన దాడిలో రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కుమారుడి ప్రేమ వ్యవహారం.. మాట్లాడుకుందామని తండ్రిని పొలాల్లోకి తీసుకెళ్లి..
Palnadu Murder Case
Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2026 | 9:35 AM

Share

పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కుమారుడి ప్రేమ వివాహ వివాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి, ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల ప్రకారం.. కారంపూడి మండలం మిరియాలకు చెందిన దారెడ్డి రామకృష్ణారెడ్డి (51) కుటుంబంతో కలిసి గురజాలలో నివసిస్తున్నారు. ఆయన తన ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్ర వాహనాల మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నారు. రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు లక్ష్మారెడ్డి, గోగులపాడుకు చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఆ జంట ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో వివాదం ముదిరింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు మంగళవారం నేరుగా గురజాలకు చేరుకుని రామకృష్ణారెడ్డితో గొడవకు దిగారు.

పొలాల్లోకి తీసుకెళ్లి..

సమస్యను సామరస్యంగా మాట్లాడుకుందామంటూ నమ్మబలికిన యువతి బంధువులు.. రామకృష్ణారెడ్డిని, ఆయన పెద్ద కుమారుడు వెంకటరెడ్డిని బైక్‌పై ఎక్కించుకుని గోగులపాడు శివారులోని నిర్మానుష్య పొలాల్లోకి తీసుకెళ్లారు. ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం.. వారిపై కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ పరిణామంతో భయపడిన పెద్ద కుమారుడు వెంకటరెడ్డి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికే తీవ్ర గాయాలపాలైన రామకృష్ణారెడ్డి ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు శివారెడ్డి, నీలకంఠారెడ్డి, కిరణ్, సామ్యేలు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసి ఒకరి ప్రాణం తీయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us