AP Single Women Pension Scheme: ఏపీలోని ఒంటరి మహిళలకు అలెర్ట్. వైఎస్‌ఆర్ పింఛను కానుక పథకం గైడ్‌లైన్స్‌లో జగన్ సర్కార్ మార్సులు చేసింది. ఈ స్కీమ్ కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పెన్షన్ అర్హత వయసును పెంచింది. ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తుండగా ఇకపై కొత్తగా అప్లై చేసుకునే వారికి 50 ఏళ్లు దాటితేనే పింఛన్ ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. భర్తను వదిలి/భర్త వదిలేసి కనీసం సంవత్సరం గడిచిన తర్వాతే పెన్షన్‌కు ఎలిజిబుల్ అవుతారని ఉత్వర్వుల్లో వెల్లడించారు. సదరు మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు తగిన డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు.
అదే విధంగా అవివాహిత మహిళలకు కూడా… అవివాహిత మహిళల పెన్షన్ అర్హత వయసును సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు రూరల్ ఏరియాలలో అవివాహిత మహిళలకు 30 ఏళ్లకే పెన్షన్ ఇస్తుండగా.. ఆ వయసును కూడా 50 ఏళ్లుకు పెంచారు. అర్బన్ ఏరియాల్లో అవివాహిత మహిళల అర్హత వయసును సైతం 35 ఏళ్లనుంచి 50 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. పెన్షన్ పొందాలంటే.. పెళ్లి కాలేదనే ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక తహసీల్దారు నుంచి తీసుకొని సమర్పించాలని స్పష్టం చేసింది. అవివాహిత మహిళలకు కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోతేనే పెన్షన్ వస్తుందని తెలిపింది. ఈ రూల్స్ కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒంటరి మహిళల విభాగంలో అర్హులైన వారికి ప్రస్తుతం నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి