Andhra Pradesh government: వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు వెల్లడించింది. మంగళవారం (డిసెంబర్ 7) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మంగళవారం నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలా, నమిలే పొగాకు పదార్థాల తయారీ, పంపిణీ, విక్రయాలను ప్రభుత్వం నిషేధించిందని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నికోటిన్ కలిపిన ఉత్పత్తులు ఏ పేరుతోనైనా తయారు చేయడం, అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం ఇకనుంచి నేరంగా మారనుందని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. కాగా.. ఏపీతోపాటు.. తెలంగాణలోనూ గుట్కా, పాన్ మసాలాలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలు కాగా.. వీటన్నింటిని కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారని ధర్మాసనం పిటిషనర్లపై సీరియస్ అయ్యింది.
Also Read: