AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రెండు నెలలు చేపల వేట నిషేధం.. అతిక్రమిస్తే ప్రభుత్వ పథకాలు బంద్.. ఎందుకంటే..

AP News: చేపల వేటను(Fishing) ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేశారు. పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని వారు వెల్లడించారు.

AP News: రెండు నెలలు చేపల వేట నిషేధం.. అతిక్రమిస్తే ప్రభుత్వ పథకాలు బంద్.. ఎందుకంటే..
Fishing Banned
Ayyappa Mamidi
|

Updated on: Apr 18, 2022 | 6:41 AM

Share

AP News: సముద్రంలో చేపల వేటను(Fishing) ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. మొత్తం 61 రోజులపాటు ఈ నిషేధం కొనసాగనుండటంతో.. ఈ సమయంలో మోటరైజ్డ్‌ బోట్లతో(Mechanized Boats) చేపల వేటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళితే కఠిన చర్యలు తప్పవని, పైగా బోటుయజమానులకు జరిమానా విధించడంతోపాటు.. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ నిలిపివేయనున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కర్రి నాగలింగాచార్యులు స్పష్టం చేశారు. వేసవి కాలంలో జీవనభృతి కల్పించడానికి 16 నుంచి నమోదు ప్రక్రియచేపట్టామని.. అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కి. మీ. మేర తీరం విస్తరించి ఉంది. తొమ్మిది గ్రామాల్లో సుమారు 40 వేల మందికి పైగా మత్స్యకారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం వేటపై ఆధారపడి జీవిస్తారు. 414 బోట్లు, పడవలు ప్రభుత్వ గుర్తింపు పొందాయి. నిషేధ కాలంలో మోటరైజ్డ్ బోట్లతో చేపల వేటకు వెళ్లకూడదు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించిన బోట్లు, పడవలకు మాత్రమే వేట విరామ భత్యం అందుతుంది. ఇందు కోసం ఈ నెల 16న సర్వే చేపట్టారు. రెండు నెలల కాలానికి మత్సకారులకు రూ. 10 వేలు చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. గతేడాది 1,551 కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఈ సహాయాన్ని పొందాయి.

అయితే 9 గ్రామాల్లో 200 కుటుంబాలు పరోక్షంగా.. 3 వేల మందికిపైగా మోచేతి వలలతో వేట సాగిస్తున్నారు. వీరికి చేపల వేటనే జీవనాధారం. రెండు నెలలు వేట నిలిచిపోతే వీరంతా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో గుర్తింపు పొందిన బోట్లు, పడవలపై వేట సాగించే వారికే కరవు భత్యం చెల్లిస్తున్నారు. మిగిలిన వారు అనర్హులుగా మిగిలిపోతున్నారు. వారిని కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని గుర్తింపు పొందని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బోట్లు, పడవలు ప్రభుత్వ గుర్తింపు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవలసిందే. మెకనైజ్డ్ బోట్లకు కలర్ కోడ్ ఉంటుంది. బోటు పైభాగానికి పసుపు రంగు, కింద భాగానికి నీలి రంగు ఉండాలి. నమోదు ప్రక్రియ ప్రారంభించే సమయానికి ప్రతి బోటుకు లైసెన్స్ చేయబడి ఉండాలి. నమోదు సమయంలో లబ్దిదారుడికి రేషన్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం తప్పని సరిగా ఉండాలి. గుర్తింపు పొందిన వారు నిషేధ సమయంలో వేటకు వెళితే కఠిన చర్యలు ఉంటాయి. బోటు యజమానికి జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను అధికారులు పూర్తి స్తాయిలో నిలిపివేస్తారు.

ఇవీ చదవండి..

Postal Recruitment: ఇండియన్‌ పోస్ట్‌లో స్కిల్డ్‌ ఆర్టిసన్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

Kashmir: కశ్మీర్ ఉగ్రవాద గ్రూపుల వద్ద అత్యాధునిక అమెరికా పరికరాలు.. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే..