ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలతో మరోసారి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ నేపధ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై సెటైర్ వేశారు. 2019 ఎన్నికలపై ప్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి సిద్దంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు. ” నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు! ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు! ” అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
నాడు లగడపాటి
సన్యాసం తీసుకున్నాడు!
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్
సిద్దంగా వున్నాడు! @PrashantKishor— Ambati Rambabu (@AmbatiRambabu) March 3, 2024
ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. చంద్రబాబుతో నాలుగు గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వర్తమాన రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ అంచనాలు తప్పుతున్నాయని, వాస్తవాలకు పొంతన లేదన్నారు.
Do not rely on @PrashantKishor's ‘gut’ who is speaking without logical data after meeting @ncbn for 4 hours. His ‘gut’ has also no relevance in present-day contemporary politics. AP Govt.’s welfare schemes were a savior of crores of people during COVID and provided a wide safety…
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 4, 2024
పీకే వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్ అంటూ ఏవో మాట్లాడారని ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రభుత్వాలు మళ్లీ ఎందుకు రావో వివరించాలన్నారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్‌లో ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలన్నారు అమర్నాథ్. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ లానే చంద్రబాబు కూడా ఆంధ్రలో చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. సీఎం వైఎస్ జగన్ ఘోర పరాజయం చవి చూస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసే కూటమి అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రజల సొమ్ము విచ్చల విడిగా పంచుతూ.. ప్రజల సంక్షేమం చూస్తున్నామనడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నారని వెల్లడించారు. అంతేగాక ప్యాలెస్‌లో కూర్చొని బటన్లు నొక్కితే ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిశోర్. ఈ వ్యాఖ్యలే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
2016లో వైసీపీతో ఒప్పందం చేసుకున్న పీకే.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్న ఆయన.. ఐప్యాక్ నుంచి కూడా బయటకు వచ్చేసి కొన్నాళ్లపాటు బిహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ సమావేశంపై స్పందించిన ఐప్యాక్ తాము వైసీపీతో ఏడాదిగా పనిచేస్తున్నామని తెలిపింది. ఒకప్పుడు పీకే సహచరుడైన రిషిరాజ్‌సింగ్ ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. అయితే, 2019 ఎన్నికల తర్వాత తమకు దూరంగా ఉంటున్న ప్రశాంత్ కిశోర్ సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీకి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.