విజయనగరం: రాహుల్ ప్రధాని అయితేనే ఏపీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని..కాంగ్రెస్ అయితేనే దేశం బాగుపడుతుందని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీకి బానిసలుగా పనిచేసే పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం అంధకారం అవుతుందని..కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా ఇస్తానని రాహుల్ చెప్పిన విషయాన్ని రఘువీరా గుర్తు చేశారు. నెలకు ఆరువేల రూపాయలు పేదవారికి ఇవ్వడం ద్వారా నిరుపేదల జీవితాలు మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రానికి నిధులను తీసుకురావడంలో టీడీపీ విఫలమయ్యిందన్న రఘువీరా.. మోడీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ పాలనకు చరమగీతం పాడాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు.