ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ఇంధనశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే సమకూర్చేకునేలా ప్రయత్నాలు చేయాలని.. అందుకు తగిన ఏర్పాట్ల చేయాలని జగన్ కోరారు. ఎలాంటి విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా.. వచ్చే వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని.. తగిన ప్రణాళికలు రచించాలని సూచించారు. సులియారీ, మహానది కోల్‌బాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ఆలోచనలు చేయాలని సీఎం జగన్ సూచించారు.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటివరకూ 16,63,705 మంది రైతుల అంగీకారం తెలిపినట్లు అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్ సూచనలు చేశారు. రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలని ఆదేశించారు. మీటర్ల వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలని కోరారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందన్నారు.
దీనివల్ల సరిపడా విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. దీనివల్ల రైతుల మోటార్లు కాలిపోవని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవని పేర్కొన్నారు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను అమర్చుతాయని తెలిపారు. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారన్నారు.
అక్కడనుంచి ఆ డబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుందని సీఎం జగన్ తెలిపారు. మీటర్లు ఉంటే.. మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించగలుగుతారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..