YSRCP: వైసీపీ నేతలకు బ్రేకింగ్ న్యూస్.. రీసర్వే చేసి అభ్యర్థులను మరోసారి మార్చే ఛాన్స్

ఇప్పటికే నాలుగు లిస్టుల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధిష్ఠానం.. ఐదో జాబితాను రెడీ చేస్తోంది. రేపోమాపో లిస్ట్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇన్‌ఛార్జ్‌లను మార్చిన పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు.. సీఎం జగన్‌ను ఆలోచనలో పడేశాయా..? క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు.. మరోసారి సర్వే చేయించాలని అధిష్ఠానం భావిస్తోందా..? పార్టీవర్గాలు ఏం చెబుతున్నాయి..?

YSRCP: వైసీపీ నేతలకు బ్రేకింగ్ న్యూస్.. రీసర్వే చేసి అభ్యర్థులను మరోసారి మార్చే ఛాన్స్
YS Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 25, 2024 | 10:20 PM

టార్గెట్‌ 175పై గురిపెట్టిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గెలుపు గుర్రాల వేట కొనసాగిస్తున్నారు. ఈ మేరకు సర్వేలు చేయించి..వాటి ఆధారంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పలు సామాజిక సమీకరణలను లెక్కల్లోకి తీసుకుని..ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నారు. పలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా.. ఇంకొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దించుతున్నారు. ఇప్పటివరకూ మొత్తం నాలుగు జాబితాలోను రిలీజ్‌ చేసిన వైసీపీ..58 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంట్ నియోజక వర్గాల్లో కొత్తవారిని నిమమించింది.

పలు నియోజకవర్గాల్లో పార్టీ చేసిన మార్పులపై స్థానిక నేతల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో కొత్త ఇన్‌ఛార్జ్‌లకు క్యాడర్‌ సహకరించని పరిస్థితి ఉంది. దీంతో ఈ మార్పులు, చేర్పులు చేసిన నియోజకవర్గాల విషయంలో పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రీ సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. మొన్నటి మార్పుల్లో ఇన్‌ఛార్జ్‌ హోదా దక్కించుకున్న వెంకటేష్‌కు..రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్‌ హోదా ఇచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుటుంబానికి కూడా న్యాయం చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని సమాచారం.

ఎమ్మిగనూరుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా రీసర్వే చేసి అభ్యర్థులను మరోసారి మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి సర్వే చేయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆయా జిల్లాల్లో టిక్కెట్​ దక్కని, నియోజకవర్గాలు మారిన కొందరు నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో పార్టీ విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉండడంతో సీఎం జగన్​ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం చేపట్టిన మార్పులు, చేర్పుల వల్ల ఏఏ నియోజకవర్గాల్లో నష్టం వాటిల్లుతుందనే అంశాలపై మరోసారి సర్వే చేయించి నిర్ణయాలు తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలు తమ టికెట్‌కు ఎక్కడ ఎసరు పెడతాయోనని టెన్షన్‌ పడుతున్నారు..కొత్తగా ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు స్వీకరించిన నేతలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.