YS Jagan: ‘మూడు రాజధానుల వల్ల కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతాయట’ పవన్‌కి సీఎం జగన్ కౌంటర్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొందరు నాయకులుగా ఉన్నవారు చేసింది చెప్పుకోలేక చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు తిడుతున్నారని ఆయన అన్నారు. 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెబితే.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారనన్నారు. రాజకీయ నాయకులు ఇచ్చే మెసేజ్ ఇదేనా అంటూ జగన్ ప్రశ్నించారు. నాలుగైదేళ్లు కాపురం చేసి, ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకుని.. పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెడితే వ్యవస్థ ఏం అవుతుంది. ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి.? ఒక్కసారి ఆలోచన చేయండి అని ఫైర్ అయ్యారు.
ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారని.. మరో 19 నెలల ఈ పోరాటం కనిపిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు తమ ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉంటాయని సీఎం జగన్ అన్నారు. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను, పొత్తులను నమ్ముకుంటే.. తాను దేవుడి దయను, అక్కచెల్లెమ్మలను నమ్ముకున్నానని ఆయన పేర్కొన్నారు. ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమన్న ఆయన.. ఈ మోసాలను, కుతంత్రాలను అస్సలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో.. రాబోయే రోజుల్లో ఎన్నో కుట్రలు కనిపిస్తాయన్నారు. ‘మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అని ఆలోచించండి.. మంచి జరిగితే నాకు తోడుగా నిలబడండి’ అంటూ ప్రజలను సీఎం జగన్ కోరారు.