YS Jagan: సంక్షేమ స్వరంలో అభివృద్ధి రాగం.. గుంటూరు గడప తొక్కగానే మారిన జగన్ పొలిటికల్‌ టోన్‌

|

Apr 13, 2024 | 7:39 PM

జ‌గ‌న్‌ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర 14వ రోజు ...జన నీరాజనాల మధ్య సాగింది. రాజధాని ప్రాంతంలో జగన్‌పై జనం అభిమానం ఉప్పొంగింది. వైసీపీ శ్రేణులతో పాటు జనం కూడా...జననేతకు గజమాలలతో స్వాగతం పలికారు. అడుగడుగునా వైఎస్ జ‌గ‌న్ బ‌స్సు యాత్రకు బ్రహ్మరథం ప‌ట్టారు.

YS Jagan: సంక్షేమ స్వరంలో అభివృద్ధి రాగం.. గుంటూరు గడప తొక్కగానే మారిన జగన్ పొలిటికల్‌ టోన్‌
Ys Jagan
Follow us on

ఇన్నాళ్లు ఒక మాట. ఇప్పుడు మరో తూటా. సంక్షేమ స్వరానికి అభివృద్ధి రాగం తోడైంది. గుంటూరు గడప తొక్కగానే అభివృద్ధి మంత్రం.. ఉపాధి తంత్రంతో ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జగన్‌. రాజధాని రాగంలో అభివృద్ధి తాళం వేస్తూ ముందుకు సాగుతోంది మేమంతా సిద్ధం యాత్ర. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై డైలాగుల డైనమైట్లు పేల్చారు జగన్‌. ఐదేళ్ల టైమ్‌లో చంద్రబాబు ఇచ్చిన గవర్నమెంటు జాబ్స్‌ ఎన్ని అంటూ సూటిగా ప్రశ్నించారు. తన 58 నెలల పాలనలో ఒక్క సచివాలయాల్లోనే లక్షా 35 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. పోర్టులు, హార్బర్లు, ఇండస్ట్రియల్‌ కారిడార్లతో సరికొత్త ఉద్యోగాల సునామీని సృష్టించబోతున్నామన్నారు జగన్‌. సంక్షేమ గళానికి అభివృద్ధి, ఉపాధి రాగాలు తోడవడంతో రాజధాని ఏరియాలో కూడా రాజకీయ సత్తా చూపిస్తోంది వైసీపీ.

జ‌గ‌న్‌ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర 14వ రోజు …జన నీరాజనాల మధ్య సాగింది. రాజధాని ప్రాంతంలో జగన్‌పై జనం అభిమానం ఉప్పొంగింది. వైసీపీ శ్రేణులతో పాటు జనం కూడా…జననేతకు గజమాలలతో స్వాగతం పలికారు. అడుగడుగునా వైఎస్ జ‌గ‌న్ బ‌స్సు యాత్రకు బ్రహ్మరథం ప‌ట్టారు. కాజ టోల్‌ గేట్ దగ్గర సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు స్థానికులు. పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. జగన్‌ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ..వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…సీఎం అంటూ నేమ్‌ బోర్డు చేసి తీసుకొచ్చాడో అభిమాని. బస్‌యాత్రలో జగన్‌ని కలిసి నేమ్‌బోర్డ్‌ అందజేయడానికి వచ్చానన్నాడు యర్రబాలెంకి చెందిన వేములకొండ వెంకటేశ్వరరావు.

ఇన్నాళ్లు ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క అంటున్నారు జగన్‌. గుంటూరు జిల్లాలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన వ్యూహం మార్చారు. గుంటూరులో కొత్త రూటు ఎంచుకున్నారు. రాజధాని ఏరియాలో జగన్ రాజకీయం కొత్త టర్న్‌ తీసుకుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల టూరులో ఉద్యోగాల రూటు తీసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న సంక్షేమ స్వరానికి పాటు అభివృద్ధి గళం తోడైంది. జాబు రావాలంటే ఫ్యాన్‌ రావాలంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల మీద స్పెషల్‌ ఫోకస్‌ పెంచారు. ఉద్యోగాల కల్పన గురించి, తాము ఇచ్చిన, ఇవ్వబోయే ఉద్యోగాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు జగన్‌.

గుంటూరు గడ్డ మీద అడుగు పెట్టగానే చంద్రబాబు హయాంలో ఇచ్చిన గవర్నమెంటు ఉద్యోగాలు ఎన్ని అని ప్రశ్నించారు జగన్‌. తన 58 నెలల హయాంలో, కేవలం సచివాలయాల్లోనే లక్షా 35 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం. చంద్రబాబుది బోగస్‌ రిపోర్ట్‌….తనది మాత్రం ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అన్నారు ముఖ్యమంత్రి. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి మంత్రం….ఉద్యోగ ఉపాధి తంత్రంతో జగన్‌ యాత్ర ముందుకు కదులుతోంది. ఏపీలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతోందని, 4 పోర్టులు. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 3 ఇండస్ట్రియల్‌ కారిడార్లు వస్తున్నాయన్నారు జగన్‌. ఎన్నడూ లేనంతగా ఉద్యోగాల కల్పనలో అడుగులు వేస్తున్నామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గుర్తు చేశారు.

ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళగిరిలోని CK కన్వెన్షన్‌లో చేనేత కార్మికులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌… ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేతలతో ముఖాముఖిలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో చేనేత వర్గానికి పోటీ చేసే అవకాశం ఇచ్చామని, దాని కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్కేను ఒప్పించామన్నారు. తమ అభ్యర్థి లావణ్య దగ్గర చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు లేదని, టీడీపీ వాళ్లు డబ్బు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసే సమయంలో ఎవరు అమ్మ ఒడి, చేయూత, నేతన్న నేస్తం ఇస్తారో ఆలోచించి ఓటు వేయండి అని చేనేత వర్గాలకు జగన్‌ విజ్ఞప్తి చేశారు. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో చంద్రబాబు కుటుంబం పోటీ చేస్తోందని, మనం టికెట్ బీసీలకు ఇస్తే.. టీడీపీ వాళ్లు డబ్బుతో గెలవాలని చూస్తున్నారన్నారు జగన్‌. హామీలు ఇచ్చి మర్చిపోతారంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు జగన్‌.

98 శాతం హామీలను విస్మరించడం చంద్రబాబు ట్రాక్‌ రికార్డ్ అన్నారు సీఎం. మంగళగిరిలో పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు ఇస్తే.. చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు జగన్. ఇళ్ల నిర్మాణం జరగకుండా కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టించారని, పేదలకు జరిగే మంచిని రాజకీయాల కోసం ఆపేశారంటూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. రాజధాని ప్రాంతంలో సంక్షేమ స్వరానికి అభివృద్ధి గళాన్ని జోడించి ముందుకు సాగుతున్నారు జగన్‌ .

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…