CM Jagan: విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పేటప్పుడు డిక్షనరీలో దాన్ని చూసి అర్థం తెలుసుకోవడంతో పాటు, వాక్యంలో ఎలా ఉపయోగించాలో కూడా నేర్పాలని సీఎం సూచించారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు పెట్టాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లలో హెడ్ మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. స్కూళ్లలో నాడు – నేడు కింద ఏర్పాటు చేసుకున్న టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ బాగుండాలని సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? చూడాలన్నారు. తల్లిదండ్రులు కడుతున్న ఫీజులకు తగ్గట్లు పిల్లలకు సౌకర్యాలు, వసతులు అందిస్తున్నారో లేదో క్రమం తప్పకుండా చూడాలని సూచించారు. నైపుణ్యం ఉన్న మానవవనరులకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉండాలని సీఎం ఆదేశించారు.
Also Read: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు