ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌తో జగన్ భేటీ అయ్యారు. అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలు పలు కీలక అంశాలపై చర్చించారు జగన్. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నవించగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.55,656 కోట్ల ఖర్చును ఆమోదించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావాస పనులకు అయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 2005-06తో పోలిస్తే 2017-18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని తెలిపారు. అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. దీని వల్ల ఆర్ అండ్ ఆర్ కోసం పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1779 కోట్లు రీయింబర్స్‌మెంట్ చేయాల్సి ఉందని, 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఏపీకి ప్రాణాధారణమైన ప్రాజెక్టు కు సంబంధించిన నిధులు వీలైనంత త్వరగా అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని సత్వరం పూర్తి చేయడానికి తగిన విధంగా సహాయం అందించాలని సీఎం జగన్ కోరారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. హోంమంత్రి అమిత్‌షాతో పలు విషయాలపై మంతనాలు..