ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. హోంమంత్రి అమిత్‌షాతో పలు విషయాలపై మంతనాలు..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబధించిన పలు అంశాలపై చర్చించారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. హోంమంత్రి అమిత్‌షాతో పలు విషయాలపై మంతనాలు..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 5:42 AM

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబధించిన పలు అంశాలపై చర్చించారు. అందులో ముఖ్యంగా.. పోలవరం అంశాన్ని గురించి ప్రస్తావించారు. ప్రాజెక్టుకోసం అయ్యే రూ.55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాలన్నారు. అనంతరం అత్యంత క్లిష్టమైన కోవిడ్‌ సమయంలో వివిధ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న తీరును వివరించారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక హోదా గురించి కూడా అడిగారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని వివరించారు.

2013–14 నుంచి 2018–19 వరకూ ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం రాష్ట్రానికి ఇంకా చెల్లించాల్సి ఉన్న రూ.1600 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే 2020 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ రాష్ట్రానికి రూ.4308.46 కోట్ల జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం స్థానిక సంస్థలకు బకాయిపడ్డ రూ. 1111.53 కోట్లు,15వ ఆర్థిక సంఘం ప్రకారం స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రూ.1954.5 కోట్లను విడుదల చేయాల్సిందిగా కోరారు. అలాగే ఉపాథిహామీ పథకంలో భాగంగా పెండింగులో ఉన్న రూ.3,801.98 కోట్లను అందించాలన్నారు.

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, దీనికోసం ఇప్పటికే అభ్యర్థనలు పంపామని, వెంటనే అనుమతులు ప్రకటించాలన్నారు. అధికార వికేంద్రీకరణ, ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక వేసుకున్నామని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని చేస్తూ ఆగస్టులో చట్టం కూడా చేశామని గుర్తుచేశారు. హైకోర్టును కర్నూలుకు రీ లొకేట్‌ చేసేలా ప్రక్రియ ఆరంభించాలని, దీనికోసం నోటిఫికేషన్‌ జారీచేయాలని హోమంత్రిని కోరారు. అలాగే ఈ విషయాలపై ప్రధాని నరేంద్రమోదీని కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.