CM Jagan: ఢిల్లీ టూర్‌కు సీఎం జగన్.. సోమవారం ప్రధాని మోదీతో ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే..

|

Aug 21, 2022 | 2:39 PM

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో సహా కేంద్ర మంత్రులను కలవనున్నారు ఏపీ ముఖ్యమంత్రి. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించనున్నారు జగన్‌..

CM Jagan: ఢిల్లీ టూర్‌కు సీఎం జగన్.. సోమవారం ప్రధాని మోదీతో ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే..
Cm Jagan
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(CM Jagan) ఢిల్లీ టూర్‌కి సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్‌ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో సహా కేంద్ర మంత్రులను కలవనున్నారు ఏపీ ముఖ్యమంత్రి. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించనున్నారు జగన్‌. ఏపీ సీఎం ప్రధానిమోదీతో భేటీ అయ్యేందుకు ఇవాళ సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రాత్రికి ఢిల్లీలో బస చేస్తారు. సోమవారం ఉదయం పదిన్నరకు ప్రధానితో భేటీ అవుతారు. ఇప్పటికే ప్రధానితో పలుసార్లు భేటీ అయిన జగన్‌, తాజాగా రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వెచ్చించిన రూ. 2,900 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రధానిని జగన్‌ కోరనున్నారు. అలాగే ముంపు మండలాల్లో జనం పునరావాసానికి నిధులివ్వాల్సిందిగా ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తారు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 55వేల 548.87 కోట్ల విడుదలకు అనుమతివ్వాల్సిందిగా సీఎం జగన్‌ కోరనున్నారు.

అయితే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ ప్రధానిని నిధుల విడుదల కోసం అడుగుతున్నననీ, ఈసారి కూడా పీఎంను నిధుల అంశాన్ని ప్రధానికి విన్నవిస్తానని జగన్‌ ముంపు మండలాల్లో పర్యటన సందర్భంగా ప్రజలకు వెల్లడించారు. అలాగే రెవెన్యూలోటు కింద కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు, విభజన సమస్యలను జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళతారు. తెలంగాణ నుంచి రావ‌ల్సిన రూ. 6627 కోట్ల‌ విద్యుత్ బ‌కాయిల విష‌యం కూడా ప్ర‌ధాని వ‌ద్ద ప్ర‌స్తావించ‌నున్నారు. కొత్త మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తివ్వాల్సిందిగా ప్ర‌ధానిని కోర‌నున్నారు సీఎం జగన్.

మరిన్ని ఏపీ వార్తల కోసం